సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 31 పోలీస్స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.7 కోట్ల 17లక్షల 82వేల 650 విలువ చేసే 2,380 కిలోల డ్రగ్స్‌ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీఎన్ఏబీ) డైరెక్టర్ సందీప్ శాండిల్యా, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆధ్వర్యంలో పోలీసులు దహనం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్, మాదాపూర్, బాలానగర్, మేడ్చల్ జోన్లలోని 31 పోలీసు స్టేషన్ల పరిధిలో 155 కేసులకు సంబంధించి పట్టుబడిన రూ.7.17 కోట్ల విలువ చేసే 2,380 కిలోల నార్కొటిక్ డ్రగ్స్‌ను నందిగామ మండలం, ఏదులపల్లి గ్రామంలోని జీజే మల్టిక్లేవ్ ప్రై.లి.లో దహనం చేశారు. ఈ దహన ప్రక్రియను క్రైమ్ డీసీపీ కె.నర్సింహ, సైబర్‌క్రైమ్స్ ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ కళింగరావు, నార్కొటిక్స్ అదనపు డీసీపీ జి.నర్సింహారెడ్డి తదితరులు పర్యవేక్షించారు.