సిటీబ్యూరో, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): ఆపరేషన్ ముస్కాన్-8లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 611 మంది బాలలకు విముక్తి కల్పించామని సీపీ స్టీపెన్ రవీంద్ర వెల్లడించారు. అందులో 535 మంది బాలురు, 76 మంది బాలికలు ఉండగా, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు 228 మంది బాలురు, 26 మంది బాలికలున్నారు. మిగతా వారు ఇతర రాష్ర్టాలకు చెందిన వారని సీపీ వెల్లడించారు. బాలలతో పనులు చేయించుకుంటున్న ఆయా యజమానులపై 75 కేసులు నమోదయ్యాయి.
మానవ అక్రమ రవాణాపై 83 కేసులు
సైబరాబాద్లో 2020లో ఏర్పాటు చేసిన హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 83 కేసులు నమోదు చేసి వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న 37 భవనాలను మూసివేయించి, 51 వాటికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త వారికి ఇండ్లు కిరాయికి ఇస్తున్నప్పుడు వాళ్లు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తారో పరిశీలించాలని సూచించారు. కిరాయికి ఇచ్చే సమయంలో ఆధార్, ఇతర ఐడీ కార్డులు పరిశీలించాలని సూచించారు. ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయంటే డయల్ 100, వాట్సాప్ నెంబర్ 94906 17444కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.