సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెడుతున్నది. నగర వాసులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన, ఆహ్లాదకరమైన పార్కును తీసుకువచ్చేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో కొత్వాల్‌గూడ ఎకో పార్కు ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గత ఏడాది నవంబర్ నాటికి సుమారు 50-60 శాతం పనులు పూర్తయినప్పటికీ దాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు గడిచినా నగర ప్రతిష్టతను ఎంతగానో పెంచే ఎకో పార్కును పూర్తి చేయడంలో హెచ్ఎండీఏ అధికారులు ముందడుగు వేయడం లేదు.
ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీగా, హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్‌గా ఉన్న దానకిశోర్ హెచ్ఎండీఏలోని పలు విభాగాల వారీగా సమీక్షలు చేస్తున్నా, కొత్వాల్ ఎకో పార్కు విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఏం అవుతుందోనన్న సందేహాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఔటర్ రింగు రోడ్డు, మరోవైపు జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్ తీరంలో సుమారు 85 ఎకరాల స్థలంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు నగరానికి మరో మకుటంగా మారే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేశంలోనే మొట్ట మొదటి వాటర్ టన్నెల్ ఆక్వేరియం, 5 ఎకరాల్లో అతి పెద్ద పక్షిశాల, ఎత్తయిన గుట్టల మధ్య 2.5 కి.మీ పొడవునా బోర్డు వాక్, అందమైన పచ్చిక బయళ్లు, క్వారీల మధ్య నీళ్లలో బోటింగ్, రెస్టారెంట్లు.. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక అంశాలతో చేపట్టిన ప్రాజెక్టు ఎకో పార్కు. హిమాయత్‌సాగర్, ఔటర్ రింగు రోడ్డు మధ్యన 85 ఎకరాల్లో సుమారు రూ.300 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పర్యాటక ప్రాజెక్టు హైదరాబాద్ మహానగర వాసులకే కాకుండా యావత్ దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేల నిర్మిస్తున్నారు. అలాంటి ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఇప్పటి వరకు సమీక్ష చేయకపోవడం, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వక పోవడంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వం దృష్టిసారించి కొత్వాల్‌గూడ ఎకో పార్కు నిర్మాణంలో వేగం పెంచాలని నగర వాసులు కోరుతున్నారు.