బడంగ్‌పేట, జనవరి 13 : బొకేలు, శాలువాలు లాంటి వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. మంత్రిని నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారు సుమారు 6 వేల నోట్ పుస్తకాలు అందించగా, అంతకు రెండింతలు మరికొందరు తమ గ్రామాల్లో విద్యార్థులకు అందజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మంత్రి పిలుపుతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని నాయకులు తమ తమ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, మ్యాట్లు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు పాఠశాల విద్యార్థులకు అందించారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి పరిగి నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేయటానికి ముందుకు వచ్చి మంత్రితో కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. శంకర్పల్లి మున్సిపాలిటీకి చెందిన 5వ తరగతి విద్యార్థి ఎండీ అసద్ తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకులోని డబ్బులతో నోట్ పుస్తకాలు కొని మంత్రికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి కోరారు. తన పిలుపునకు స్పందించి ముందుకు వచ్చిన అందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.