సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లోని పలుచోట్ల ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రూ.6.5 లక్షల విలువైన గంజాయితో పాటు డీసీఎం వ్యాన్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం డీటీఎఫ్ సీఐ భరత్‌భూషన్ తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన హరి కుశ్వాహ వద్ద 4 కిలోలు, ఒడిశాకు చెందిన బైనాథ్ బిశ్వాల్ వద్ద 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను అరెస్ట్ చేసి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
కాగా మరో కేసులో నాందేడ్ నుంచి డీసీఎం వ్యాన్‌లో గంజాయి రవాణా చేస్తున్న డ్రైవర్ ఫైసల్‌ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 2.230కిలోల గంజాయితో పాటు డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కాగా మరో కేసులో హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్న 432 కేజీల నల్ల బెల్లం, 10 కేజీల అలం (పటిక) పట్టుకున్నారు. గోపన్‌పల్లిలో గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయి విక్రయిస్తున్న తెల్లాపూర్‌కు చెందిన బెలాల్ బేపారిని శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్దనుంచి 3 కిలోల ఎండు గంజాయి,సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.