సిటీబ్యూరో, ఆగస్ట్ 4 (నమస్తే తెలంగాణ): ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, ప్రభుత్వస్థలాల కబ్జాకు సంబంధించిన వాటిపై దృష్టిపెట్టి లేఔట్ ప్రామాణికంగా తీసుకుని.. వాటిని పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యలపై 58 ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని బోయిగూడ సమీపంలో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఉన్న సమయంలో కురుమ శ్మశానవాటిక కోసం ప్రత్యేకంగా రెండు వేల గజాలను కేటాయించగా, ప్రస్తుతం ఆ జాగ కబ్జాకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, బాచుపల్లి ప్రాంతం, శ్రీసాయికృష్ణకాలనీలోని లేఔట్లో 1700 గజాల పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని కాలనీ వాసులు కోరారు. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 69లో రహదారిని కొందరు ఆక్రమించారని, కుత్బుల్లాపూర్ మండలం, భగత్‌సింగ్‌నగర్‌లో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.