ఖైరతాబాద్, డిసెంబర్ 31 : ఓ వ్యక్తి ఫోన్‌ను తస్కరించి పారిపోయి దాక్కున్న దొంగల ముఠాను పోలీసులు చుట్టు ముట్టి పట్టుకున్నారు. ఒక్క ఫోన్ కోసం విచారణ జరిపి తీగ లాగితే అంతర్రాష్ట్ర దొంగల ముఠా డొంక కదిలింది. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మంగళవారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సంజయ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. చింతలబస్తీకి చెందిన మహేందర్‌రెడ్డి అనే వ్యక్తి రోడ్డుపై నిలబడి సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా, ముగ్గురు వ్యక్తులు వచ్చి లాక్కొని పారిపోయారు. దీంతో బాధితుడు వారి వెంట పరిగెత్తుతూ పట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రేమ్‌నగర్‌లోని డెడ్ ఎండ్ ఉన్న ఓ గల్లీలోకి వెళ్లి మాయమయ్యారు. ఆ ముఠా కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు తలదాచుకున్న ఇంటిని గుర్తించి చుట్టుముట్టి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. విచారణ జరుపగా, జార్ఖండ్‌కు చెందిన ముఠా నాయకుడు పింకుమహతో నేతృత్వంలో పనిచేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని తేలింది. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.30లక్షల విలువైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని సాహెబ్‌గంజ్ జిల్లా బాబుపూర్ గ్రామానికి చెందిన దీపక్ కుమార్ అలియాస్ దీపక్ (21), అదే ప్రాంతానికి చెందిన గోబింద్ కుమార్ (23), రాహుల్ నోనియా అలియాస్ రాహుల్, సాగర్ కుమార్ నోనియా, కుషాల్ నోనియాలను పింకు మహతో నిరుద్యోగం, వారి ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని సెల్‌ఫోన్ దొంగతనాల కోసం నియమించాడు. దొంగతనాలు చేసినందుకు గాను ఒక్కొక్కరికి రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నాడు. ఈ ముఠా సభ్యులు పలు కాలనీల్లో ఫేక్ ఆధార్ కార్డులతో ఇండ్లు కిరాయికి తీసుకొని తమ కార్యకలాపాలు సాగిస్తారు. జనావాస ప్రాంతాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్లను టార్గెట్ చేసి పక్కా ప్రణాళికతో దొంగతనం చేస్తారు. దొంగిలించిన సొత్తును జార్ఖండ్‌కు తరలిస్తారు. అక్కడ పింకు మహతో వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. ఏ1గా ఉన్న దీపక్ కుమార్ పాత నేరస్తుడు. ఇతడిపై మొగల్పుర, ఎస్ఆర్నగర్, గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారు తొమ్మిది కేసులు ఉన్నాయి. అతనితో పాటు పోలీసులకు దొరికిన మరో ఇద్దరు నిందితులపై సెల్‌ఫోన్ దొంగతనాలకు సంబంధించి 13 కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్, డీఐ సీహెచ్ సైదులు, ఎస్సై ఆర్.నాగరాజును అభినందించారు.