Komuravelli Jatara |చేర్యాల, జనవరి 19: గజ్జెల లాగులు.. ఢమరుక నాదాలు… డోలు చప్పుళ్లు… అర్చకుల పూజలు…. ఒగ్గు కథ పూజారుల పట్నాలు, పోతరాజుల విన్యాసాలు.. మహిళల బోనాల సమర్పణతో ఆదివారం మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన పట్నం వారానికి 50 వేల మంది వరకు భక్తులు హాజరయ్యారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వారాన్ని పట్నం వారంగా పిలువడం ఆనవాయితి. పట్నం వారానికి హైదరాబాద్ భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని, పెద్ద పట్నం వేసి అగ్నిగుండం దాటుతారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన బంధువులు, స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు.
ఉత్సవాలకు శనివారం సాయంత్రం నుంచే భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి రావడం ప్రారంభమైంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, బైక్‌లపై భారీగా భక్తులు వచ్చారు. ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన దర్శనాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి 2.30 గంటలు, శీఘ్ర దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయ ఈవో కె.రామాంజనేయులు, కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. అద్దె గదుల వద్ద చిలుకపట్నం, గంగరేగు చెట్టు వద్ద నజరు పట్నం, మహా మండపంలో ముఖ మండప పట్నాలు వేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
స్వామి వారికి కల్యాణం నిర్వహించడంతో పాటు అమ్మవార్లకు ఒడి బియ్యం పోయడం, అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు మల్లన్నను దర్శించుకుని పట్నాలు వేసి, మల్లన్న గుట్ట పైన ఉన్న ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. సిద్దిపేట, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, జనగామ తదితర జిల్లాల నుంచి వచ్చే దారులన్నీ కొమురవెల్లి క్షేత్రం వైపే పరుగులు తీశాయి. రెండు కిలోమీటర్ల మేర దారులు భక్తులతో నిండిపోయాయి. సోమవారం మల్లన్న ఆలయ వర్గాల సహకారంతో హైదరాబాద్ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణ వేదిక వద్ద పెద్ద పట్నం వేసి అగ్నిగుండం తయారు చేస్తారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు పెద్ద పట్నం, అగ్నిగుండం దాటి స్వామి వారిని మరోసారి దర్శించుకుంటారు. అనంతరం, నల్ల పోచమ్మ, కొండ పోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.