మలక్‌పేట: మలక్‌పేట మెట్రోస్టేషన్ మెట్ల కింద పార్కు చేసిన ఐదు బైకులకు నిప్పంటుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు మెట్రోస్టేషన్‌ను పూర్తిగా కమ్మేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మలక్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో నిత్యం స్టేషన్ మెట్ల కింద ప్రయాణికులు తమ ద్విచక్రవాహనాలను పార్కు చేసి వెళ్తుంటారు. అయితే రోజు మాదిరిగానే పార్కు చేసిన వాహనాలకు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగాయి.
దట్టమైన పొగలు మెట్రోస్టేషన్‌ను కమ్మేయడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు, మెట్రో అధికారులు చాదర్‌ఘాట్ పోలీసులకు, మలక్‌పేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే ఫైరింజన్‌తో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే ఐదు బైకులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో మలక్‌పేట-దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. కాగా, మెట్రో స్టేషన్ కింద పార్కు చేసిన వాహనాల నుంచి దొంగలు పెట్రోల్ దొంగిలిస్తుంటారని, పెట్రోల్‌ను దొంగిలించే క్రమంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు.