సిటీబ్యూరో/బంజారాహిల్స్ ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ఇసుంట రమ్మంటె ఇల్లంత నాదే అన్నడట! అనేది పాత సామెత. కానీ ఇక్కడ ఇసుంట రమ్మన్న వాళ్లే ఈ ఇల్లంత నీదేనని రాసిస్తుండటం కొత్త ట్రెండు. ప్రస్తుతం కేబీఆర్ పార్కు ప్రాంగణంలో నవ నిర్మాణ్ సంస్థ పట్ల ఘనత వహించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీరు కూడా ఇట్లనే తయారైంది. గతంలో సర్కారు ‘ముఖ్య’నేత సోదరుడు ఒకరు పార్కు వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ పేరిట నవ నిర్మాణ్ సంస్థను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో టెండర్లలో గోల్మాల్ చేసి సదరు సంస్థకు పార్కింగ్ దక్కేలా అధికారులు రూట్ క్లియర్ చేశారు. ఎలాగూ ఒకసారి 485 చదరపు గజాలు రాసిచ్చాం కదా.. పైగా వీవీఐపీల పైరవీ అనుకున్నారో ఏమో! అంచెలంచెలుగా కేబీఆర్ పార్కు ప్రాంగణాన్నే కబళించేలా బల్దియా సహకరిస్తుండటం, ఏకంగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీల్లోనే నిర్ణయాలు తీసుకుంటుండటంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేబీఆర్ పార్కు ప్రాంగణంలో 485 చదరపు గజాలతో అడుగుపెట్టిన నవ నిర్మాణ్ సంస్థ ఇప్పుడు అధికారిక, అనధికారిక కేటాయింపుల రూపంలో 1300 చదరపు గజాల వరకు విస్తరించడమంటే అధికారుల అండదండలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
వడ్డించేవాడు మనవాడైతే.. అన్న చందంగా ప్రభుత్వ పెద్దలతో ఉన్న పరిచయాలను అసరాగా చేసుకుని నగరం నడిబొడ్డున ఖరీదైన స్థలాన్ని మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ పేరుతో కాజేసిన నవ నిర్మాణ్ అసోసియేట్స్ సంస్థ మరో 200 గజాలను సొంతం చేసుకుంది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద గతంలోనే 485 గజాల స్థలాన్ని లీజు పేరుతో దక్కించుకుని సుమారు 1000 గజాల స్థలాన్ని అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకున్న నవ నిర్మాణ్ సంస్థకు మరో 200 గజాల స్థలాన్ని సీఎస్ఆర్ పేరుతో మూడేండ్ల పాటు లీజుకు ఇస్తూ జీహెచ్ఎంసీ స్టాండిండ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో పాటు జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారుల సహకారంతో నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ కారు పార్కింగ్ ప్రాజెక్టు పేరుతో అనేక అక్రమాలకు పాల్పడుతుండడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 8 చోట్ల మల్టీలెవల్ కారు పార్కింగ్లు చేపట్టాలని, పైలెట్ ప్రాజెక్టుగా కేబీఆర్ పార్కు గేట్ -1 వద్ద మల్టీలెవల్ స్మార్ట్ (మెకనైజ్డ్) కార్ అండ్ మోటారు సైకిల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులను డీబీఎఫ్ఓటీ పద్ధతిలో వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హడావుడిగా టెండర్లను పిలవడంతో పాటు నవ నిర్మాణ్ అసోసియేట్స్ సంస్థకు కేటాయించింది. టెండర్ కేటాయింపు ప్రక్రియలో సైతం అనేక అవకతవకలు జరిగాయని, గతంలో జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగానికి కోట్లాది రూపాయలు చెల్లించకుండా ఎగవేసిన వ్యక్తులకే మల్టీ లెవల్ పార్కింగ్ కోసం స్థలం ఎలా ఇస్తారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేబీఆర్ పార్కు బయట జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలంలోని 485 గజాలను 15 ఏండ్ల కోసం నవనిర్మాణ్ అసోసియేట్ సంస్థకు రూ. 28.23 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఈ మేరకు నవ నిర్మాణ్ అసోసియేట్ సంస్థ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు మొదటి గేటు వద్ద స్మార్ట్ మెకనైజ్డ్ కార్, వెహికల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 70 కార్లకు పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు చేపట్టగా..ప్రకటనలు, ఇతర కేఫెటేరియా రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుని ఏటా రూ. 28 లక్షల చొప్పున జీహెచ్ఎంసీకి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
కేబీఆర్ పార్కు బయట చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి సారించలేదని ఆరోపణలు ఉన్నాయి. మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి అధికారికంగా కేటాయించిన స్థలం 485 గజాలు మాత్రమే కాగా అనధికారికంగా సుమారు 1000 గజాల జీహెచ్ఎంసీ స్థలాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. మెకనైజ్డ్ పార్కింగ్ కాంప్లెక్స్ ఉన్న స్థలానికి అదనంగా ఉన్న స్థలాన్ని కూడా రోడ్డు పేరుతో ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా కేబీఆర్ వాక్‌వే ప్రహరీ కూల్చేసి సుమారు 100 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని ప్రహరీ నిర్మించారు. ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నా టెండర్ కేటాయించిన జీహెచ్ఎంసీ ప్రకటనల విభాగం అధికారులు, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ అధికారులు, స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ పార్కుల విభాగం అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడంతో వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలున్నాయి.
అధికారికంగా మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కాకముందే కాసులకు కక్కుర్తి పడిన నవ నిర్మాణ్ అసోయేట్స్ నిర్వాహకులు భారీ సైజులోని డిజిటల్ ప్రకటన బోర్డుపై ప్రకటన దందాకు తెరలేపడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా ఈ మేరకు జీహెచ్ఎంసీ ఇటీవల నవ నిర్మాణ్ అసోసియేట్స్‌కు నోటీసులు సైతం జారీ చేసినా పట్టించుకోవడం లేదు. తాజాగా గురువారం నిర్వహించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మల్టీ లెవల్ పార్కింగ్ పక్కనున్న 200 గజాల స్థలాన్ని సైతం పబ్లిక్ టాయిలెట్స్ పేరుతో సీఎస్ఆర్ పేరుతో నవ నిర్మాణ్ అసోసియేట్స్ సంస్థకు మూడేండ్ల పాటు కేటాయించడం గమనార్హం. గతంలో ఇక్కడ కడక్ చాయ్ పేరుతో ఉన్న టీ స్టాల్ నిర్వాహకులు నిర్వహిస్తున్న స్వచ్ఛ టాయిలెట్స్‌ను దౌర్జన్యంగా తొలగించిన నవ నిర్మాణ్ అసోసియేట్స్ ఇప్పుడు తాజాగా సీఎఎస్ఆర్ పేరుతో టాయిలెట్స్ నిర్మాణం చేస్తామని స్థలాన్ని తీసుకోవడం గమనార్హం. మొత్తం మీద మల్టీ లెవల్ పార్కింగ్ పేరుతో ఒకవైపు ఖరీదైన భూమిని కాజేయడంతో పాటు సీఎస్ఆర్ పేరుతో మరో 200 గజాల స్థలాన్ని తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.