కందుకూరు, డిసెంబర్ 11: అందరూ ఊహించినట్టుగానే.. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలకు నిర్వహణ నిధు లు విడుదల చేసింది. సుమారుగా 18 నెలల కిదట ప్రారంభించిన ఈ వేదికల నిర్వహణకు ఒక్కో దానికి రూ. 9 వేల చొప్పున అందిస్తామని చెప్పింది. అయితే కరోనా కారణంగా నిధుల కేటాయింపు విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నది. ఇందులో భాగంగా ఐదు నెలలకు సంబంధించి ఒక్కో రైతు వేదికకు రూ.45వేల చొప్పున డివిజన్ పరిధిలోని మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లోని 17 రైతు వేదికలకు మొత్తం రూ.76.5లక్షల నిధులను విడుదల చేసింది. ఇవి ఇప్పటికే ఏడీఏల ఖాతాల్లో జమచేయగా, రైతుబంధు సమితులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రైతులను సంఘటింతం చేయాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రతి ఐదు వేల హెక్టార్లకు ఒక క్లస్టరును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది.
ప్రతి క్లస్టరు ఒక ఏఈవోను నియమిస్తామని, ఒక రైతు వేదికలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22లక్షలు అంచనా వేశారు. 2020-2021 సంవత్సరంలో రైతు వేదికలు అందుబాటులోకి వచ్చా యి. వీటి నిర్వాహణ కోసం రూ.9వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా నిధుల కేటాయింపులో కొంత జాప్యం జరిగినా అప్పుడు అన్నట్లుగానే ప్రస్తుతం ఐదు నెలల నిర్వహణ ఖర్చులకు నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగానే రైతు వేదికలు రైతన్నలకు సేవలు అందిస్తున్నాయి. రైతులకు సమాచారం కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రతి సీజన్లో శిక్షణ కార్యక్రమాలు రైతు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో అన్నదాతలు, వ్యవసాయ అధికారులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేదికలు మరింత పటిష్టం
రైతు వేదికలు నిర్మించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా విడుదల చేసిన నిర్వహణ ఖర్చులు నిధులను వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ మొత్తాన్ని అందిస్తాం. విద్యుత్ బిల్లులు, క్లీనింగ్ చార్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాం. ఇతర ఖర్చులు కూడా చేసుకునే అవకాశం ఉంది. వేదికలను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతు వేదికలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
– సుజాత, ఏడీఏ మహేశ్వరం డివిజన్
ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తాడు. రైతు కాబట్టి రైతుల బాధలు తెలుసు. సీఎంగా కాకుండా రైతుగా ఆలోచిస్తాడు. ఉచిత కరెంట్‌తో పాటు రైతు బీమా, రైతు బంధు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పరికారాలు, రుణమా ఫీ వంటి పథకాలతో దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నా డు. రైతుల గురించి రైతు వేదికలను నిర్మించిన ఏకైక సీఎం కేసీఆర్, రైతులు ఆయనకు రుణపడి ఉంటారు.
– సురుసాని సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్