బడంగ్‌పేట, సెప్టెంబర్ 3: మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు 44 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పీఏసీఎస్ చైర్మన్ పాండు యాదవ్, మాజీ సర్పంచ్ బండారు లింగం, యూత్ అధ్యక్షులు మంచే పవన్ కుమార్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
సబితారెడ్డి వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే నాయకులు వివిధ పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీలేదని తేలిపోయిన తర్వాతనే ఆ పార్టీల నాయకులు గులాబీ గూటికి వస్తున్నారన్నారు.
కేసీఆర్ నాయకత్వం పై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పార్టీకోసం పనిచేసేవారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.