సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా అభయహస్తంతో పాటు కొత్త రేషన్‌కార్డులు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 9,92,234 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఇందులో అభయహస్తం కింద 8,46,097 ఉంటే..ఇతర అప్లికేషన్లు 1,46,137 ఉన్నాయి. ఒక్క శనివారమే 4,22,490 దరఖాస్తులను స్వీకరించారు అధికారులు.
అభయహస్తం దరఖాస్తు ఫారాలను ఎవరు కూడా కొనుగోలు చేయవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ తెలిపారు. ఎవరైనా దరఖాస్తులు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం జీహెచ్ఎంసీ పరిధిలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఒక్కో కేంద్రంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం వరకు అభయహస్తం పథకం కింద 5 లక్షల 69వేల 753 దరఖాస్తులు అందగా, ఇతర అప్లికేషన్లు 71,326 వచ్చాయన్నారు. 40 లక్షల దరఖాస్తు ఫారాలను ప్రింట్ చేశామని, తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంచామన్నారు. ఆది, సోమవారం సెలవు కారణంగా రెండు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ఉండదని, తిరిగి 2 నుంచి 6 వరకు యథావిధిగా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.