Electricity Department | సిటీబ్యూరో, మే 5(నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి డివిజన్లో 42 మీటర్ల గోల్మాల్ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఏఈ భాస్కర్ రావుతో సహా లైన్ మెన్ , మీటర్ రీడర్లపై వేటు వేస్తూ శనివారం దక్షిణ డిస్కం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గచ్చిబౌలి సెక్షన్ లో 42 సర్వీసులను జనవరి 2025 లో మంజూరు చేసినట్టు రికార్డులో ఉంది. కానీ మీటర్లు బిగించలేదు. తనిఖీల్లో ఒక కాంట్రాక్టర్ వద్ద ఆ మీటర్లు ఉన్నట్టు తేలిందని అధికారులు తెలిపారు.
వాస్తవానికి మీటర్ భవనంలో ఏర్పాటు చేసేంతవరకు అసిస్టెంట్ ఇంజినీర్ ఆధీనంలో ఉండాలి.. కానీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మీటర్లు మిస్ అయినట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి డివిజన్ ఏఈ భాస్కర్ రావు, ఏరియా లైన్మెన్, మీటర్ రీడర్లను సస్పెండ్ చేశారు. శాఖాపరంగా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు సంస్థ ఆదాయానికి గండి పడేలా చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.