సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చి ప్రజలకు ఇబ్బందులు తొలగించడంతోపాటు జీహెచ్ఎంసీ విద్యుత్ భారాన్ని తగ్గించుకుంది. ఎల్ఈడీ వీధి దీపాల ద్వారా ఇప్పటి వరకు రూ. 418కోట్లు ఆదా చేసుకున్నది. ఈ విషయాన్ని సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వీధి దీపాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సమస్యగా ఉండేది. వీధి దీపాలకు పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చయ్యేది. విద్యుత్ బిల్లులు సైతం అధికంగా వచ్చేవి. వీధి దీపాలు వేసేందుకు, ఆపేందుకు ప్రత్యేకంగా సిబ్బంది కూడా అవసరమయ్యే వారు. వారి వేతనాలకు కూడా బోలెడంత ఖర్చయ్యేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో 4.93 లక్షల వీధి దీపాల (18 మెగా వాట్ల సామర్థ్యం)కు ఎల్ఈడీ లైట్లు అమర్చారు. దీంతో రూ. 418 కోట్లు ఆదా అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతోపాటు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్న వనరులను జీహెచ్ఎంసీ వినియోగిస్తున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో జీహెచ్ఎంసీ ముందుకెళ్తూ తకువ ఖర్చులతో ఎకువ ప్రయోజనం పొందే విధంగా కృషి చేస్తున్నట్లు అధికారులు
పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీలో ఆదా ఇలా..
జీహెచ్ఎంసీలో 2017 -18 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు రూ. 418.26 కోట్లు ఆదా అయ్యింది. 2017- 18 సంవత్సరంలో రూ. 42.42 కోట్లు, 2018-19 లో రూ. 85.23 కోట్లు, 2019-20 లో రూ. 84.48 కోట్లు, 2020-21 లో రూ. 86.72కోట్లు, అక్టోబర్ 2021 వరకు రూ. 49.93 కోట్లు.. మొత్తం రూ. 347.78 కోట్లు సీసీలు ఆదా కాగా, వస్తువుల కొనుగోలు (మెటీరియల్ ప్రొక్యూర్మెంట్)తో రూ. 52.కోట్లు, లేబర్ రేషనలైజేషన్తో కలిపి మొత్తం రూ. 418.26 కోట్లు ఆదా అయినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, పబ్లిక్ రంగ సంస్థ (ఎన్టీపీసీ) జాయింట్ వెంచర్తో పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో వీధి దీపాల నిర్వహణ సమర్థవంతంగా కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.