సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ధనార్జనే ధ్యేయంగా కొన్ని మత్తు మాఫియాలు యథేచ్ఛగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి. పోలీసులు, ఆబ్కారీ అధికారులు, టీజీన్యాబ్ అధికారులు ఎన్ని దాడులు జరిపినా, ఎంత నిఘా పెట్టినా నగరంలో గంజాయి వ్యాపారం ఆగడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతోందంటే ఈ మత్తు వ్యాపారం ఎంతలా విస్తరించిందో, ఎంత మందిని తనకు బానిసగా మలుచుకుందో అర్థం చేసుకోవచ్చు.
యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి నగరానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న మాఫియాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు నిందితులను ఎక్కడికక్కడ పట్టుకుని అరెస్టు చేయాలని జారీచేసిన ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మేడ్చల్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంగణంలో రూ.2.5కోట్ల విలువైన 410కిలోల గంజాయిని ఆబ్కారీ స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు.
ఈ మేరకు ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈడీ కమలాసన్‌రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన గణేశ్ రామస్వామి డ్రైవర్. అతడికి రత్నాభాయి అనే గంజాయి వ్యాపారితో పరిచయం ఏర్పడింది. తనతో కలిసి గంజాయి వ్యాపారం చేయాల్సిందిగా గణేష్ రామస్వామికి సదరు మహిళ చెప్పడంతో అందుకు అతడు అంగీకరించాడు. గంజాయి రవాణా చేయడం కోసం డ్రైవింగ్ వృత్తిలో ఉన్న విజయ్ శంకర్ కులకర్ణి అనే వ్యక్తి సహకారం తీసుకున్నాడు. గంజాయి రవాణా కోసం ప్రత్యేకంగా మహీంద్రా మినీ వ్యాను కొనుగోలు చేశాడు.
రత్నాభాయి సహకారంతో ఒడిశాలోని గంజాయి సరఫరా దారులతో పరిచయాలు పెంచుకుని, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. రెండు రోజుల క్రితం గణేశ్ మరో డ్రైవర్ విజయ్ శంకర్ కులకర్ణితో కలిసి శ్రీకాకులం జిల్లా పలాసకు వెళ్లారు. అక్కడి నుంచి ఒడిశాకు వెళ్లి తక్కువ ధరలో పెద్ద ఎత్తున గంజాయి కొనుగోలు చేశారు. అయితే దారిలో పోలీసుల కంట పడకుండా ఉండేందుకు పలాసలో పనస పళ్లు కొనుగోలు చేసి, గంజాయి బస్తాలపై పరిచి మహారాష్ట్రకు బయలు దేరారు.
ముందస్తుగా అందిన సమాచారం మేరకు ఆబ్కారీ ఎస్టీఎఫ్ బృందాలు 20 రోజుల నుంచి నిందితుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద మాటు వేశారు. సోమవారం ఉదయం మేడ్చల్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాటువేసిన అధికారులకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కలిగిన పనస పళ్ల లోడ్‌తో మహేంద్ర మినీ వ్యాన్ కనిపించింది. అప్రమత్తమైన బృందాలు వ్యాన్‌ను తనిఖీ చేశారు. అందులో ఉన్న వ్యక్తులను విచారించగా, తాము పళ్ల వ్యాపారం చేస్తామని, శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి పనస పళ్లను మారెట్‌కు తరలిస్తున్నామని చెప్పారు.
అనుమానం వచ్చిన అధికారులు వ్యానును క్షుణ్ణంగా తనిఖీ చేయగా పనస పళ్ల లోడ్ కింది భాగంలో గంజాయిని బస్తాలు దర్శనమిచ్చాయి. నిందితులిద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.5కోట్ల విలువైన 410కిలోల గంజాయి, రూ.8లక్షల విలువైన మహీంద్రా మినీ వ్యాన్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎస్ఐ జ్యోతి, వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు ఎండి. మౌలాలీ, వేణు కుమార్, లోకేశ్, చరణ్, శశి కిరణ్, వినోద్, శివ, రమేశ్ తదితరులను ఈడీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.