సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : బహిరంగ ప్రదేశాల్లో ఈ-వాహనాల కోసం చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనదారులకు చార్జింగ్ సమస్య లేకుండా తక్కువ ధరతో ఈ-చార్జింగ్ కేంద్రాలను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ చార్జింగ్ స్టేషన్ తక్కువ ధరతో తొందరగా చార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ యూనిట్ యంత్రాలను అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ఈ మేరకు గ్రేటర్ వ్యాప్తంగా రెడ్ కో సహకారంతో యూనిట్‌కు ఒక రూపాయి కమీషన్‌కు జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంది. గ్రేటర్లో ఈవీ కార్ల సంఖ్య దాదాపు 5వేల వరకు ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు.. అందుకు అనుగుణంగా చార్జింగ్ పాయింట్లు పెంచుతున్నారు. ఇప్పటికే 43 ప్రాంతాల్లో అమలు అవుతుండగా, తాజాగా మరో 40 చోట్ల చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది.
గ్రేటర్లో 150 చోట్ల ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో తో ఒక రూపాయి కమీషన్ చొప్పున బల్దియా ఆదాయ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. టీజీ రెడ్కో ఇప్పటి వరకు 83 ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఇన్స్టాల్ చేసింది. వాటిలో 43 చార్జింగ్ స్టేషన్లు పలు ప్రాంతాల్లో కమీషన్ చేశారు. మిగిలిన మరో 40 చోట్ల కమీషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క యూనిట్‌కు రూ.15.34 రూపాయలు కాగా, ప్రైవేట్ చార్జింగ్ స్టేషన్లో రూ.23.6ల నుంచి 35.4 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్లు తక్కువ రేటుతో పాటు కేవలం 40 నిమిషాల్లో చార్జింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కొక్క చార్జింగ్ స్టేషన్ 60 కిలో వాట్ల కెపాసిటీ కలిగి ఉంది. ఒక్కొక్క కారు కెపాసిటీ 20 యూనిట్లు కాగా 30 నిమిషాల్లో కారు చార్జింగ్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ చార్జింగ్ వాహనాలకు చార్జింగ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పాయింట్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, బల్దియా సెంటర్ల వద్ద యూనిట్‌కు రూ. 13తో పాటు 18శాతం జీఎస్టీ కలిపి రూ. 15.34 వరకు, అదే ప్రైవేట్‌లో మాత్రం రూ. 20 నుంచి రూ.25ల వరకు (18 శాతం జీఎస్టీ అదనంతో) వసూలు చేస్తున్నారు.