బడంగ్ పేట్, మే 4: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని సరుకులు ఒకే చోట లభించే విధంగా సంయుక్త మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయడానికి మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయడానికిరూ. 18 కోట్లు కేటాయించారు. బడంగ్‌పేటలో రూ. 4.50 కోట్లతో, తుక్కుగూడలో రూ. 4.50 కోట్లతో, జల్ పల్లి లో రూ. 4.50 కోట్లతో, మీర్ పేట్ లెనిన్ నగర్ లో రూ. 4.50 కోట్లతో నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టారు. 2022 జనవరి 29వ తేదీన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇంటిగ్రేటెడ్ పనులకు శంకుస్థాపన చేశారు. తుక్కుగూడ, బడంగ్‌పేట, జల్పల్లి పనులు కొంతమేరకు అయిపోయాయి. మీర్పేట్లో స్థల వివాదం కారణంగా పనులు ప్రారంభించలేదు. ఇంటిగ్రేటెడ్ పనులకు శంకుస్థాపన చేయగానే టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పనులు చకచకా సాగడం మొదలయ్యాయి. పనులు జరుగుతున్న క్రమంలోని ఎన్నికల కోడ్ రావడంతో మార్కెట్ పనులు నత్త నడకన సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటిగ్రేటెడ్ పనులను పట్టించుకోవడం మర్చిపోయారు. దీంతో పనులన్నీ మధ్యలోని నిలిపివేశారు. మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఇంటిగ్రేటెడ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అనేకమార్లు సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్లతో ఎన్నో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కోట్ల రూపాయలతో చేపట్టిన సంయుక్త మార్కెట్ పనులను మధ్యలోనే నిలిపివేస్తే ప్రయోజనం ఉండదని ఎమ్మెల్యే పి సవిత ఇంద్రారెడ్డి అధికారులతో చర్చించారు. అయినా కూడా అధికారులల్లో ఏ మాత్రం మార్పు లేదు.
సంయుక్త మార్కెట్ తో సకలజనులకు పని:
సంయుక్త మార్కెట్లను ఏర్పాటు చేయడం వల్ల, సకల జనులకు పని దొరుకుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రజలకు అన్ని సరుకులు ఒకే చోట లభించే అవకాశం ఉంటుంది. ఒక వస్తువు కోసం మరో చోటుకు పోకుండా ఉండటానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యవసర సరుకులతో పాటు కూరగాయలు, కిరాణం, ఫిష్ మార్కెట్, మాంసం మార్కెట్, చికెన్ మార్కెట్ అన్ని ఒకే చోట్ల దొరికే విధంగా ప్రణాళికలు రూపొందించారు. గత ప్రభుత్వం చేసిన ప్రణాళికలపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది ఇంటిగ్రేట్ మార్కెటింగ్ నిదర్శనం.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు మోక్షం ఎప్పుడు?
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు చోట్ల ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పూర్తి చేయడానికి మోక్షం ఎప్పుడొస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించకపోవడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఇంటిగ్రేటెడ్ పనులన్నీ మభ్యంతరంగానే నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పనులు జరుగుతాయని కాంట్రాక్టర్లు సైతం పేర్కొంటున్నారు. చేసిన పనులకు డబ్బులు రాకపోతే పనులు ఎలా పూర్తి చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను త్వరగా పూర్తిచేయాలని చిరు వ్యాపారుల సైతం కోరుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ పనులను ఎలాగైనా పూర్తి చేయిస్తా: మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఎలాగైనా పూర్తి చేయిస్తానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిధులు కేటాయించాలని చాలాసార్లు కోరుతున్నామని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉందన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పనులకు నిధులు కేటాయించడం లేదని.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఇంటిగ్రేటెడ్ పనులు పూర్తయితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటుపై స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే జనరల్ ఫండ్ నుంచి మార్కెట్ పనులు పూర్తి చేయిస్తానని తెలిపారు. ప్రజల అవసరాల కోసం పనిచేస్తానని.. ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకకు లాగుతుందని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.