Medchal ZP | మేడ్చల్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీ కొనసాగేనా? జిల్లాలో ఉన్న 34 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ఇటీవలే ప్రభుత్వాన్ని జిల్లా అధికారులు కోరిన విషయం తెలిసిందే. ఐతే, మరో పక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఒక వేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినట్లయితే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీని కొనసాగించాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాత్రం జిల్లాలో సస్పెన్స్‌గానే కొనసాగుతుంది. మిగిలిన 34 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీ నం చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జిల్లా జడ్పీని కొనసాగింపునకు ఉన్న మూడు మండలాలలతోనే సరిపెడితారా? లేక మరో రెండు మండలాల సంఖ్యను పెంచుతారా? అన్నది అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు. 2016వ సంవత్సరంలో ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో మొత్తం గా 15 మండలాలు, 61 గ్రామాలు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశా రు. నాలుగు నియోజకవర్గాలు, 10 మండలాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, 5 మండలాలు, 61 గ్రామాలున్నాయి. ఇటివలే 61 గ్రామాల నుంచి 28 గ్రామాలను మున్సిపాలిటీలలో విలీనం చేసిన క్రమంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 5 మండలాలు మూడు మండలాలుగానే మిగిలాయి. ఉన్న మూడు మండలాలలో జడ్పీని కొనసాగిస్తారా? లేక మరో రెండు మండలాలను పెంచి గతంలో లాగా, 5 మండలాలలో జడ్పీని నిర్వహిస్తారా? అన్నది నోటిఫికేషన్ విడుదల చేసిన రోజునే తెలిపోనుంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ నాయకులు అంతగా ఇష్టం చూపడం లేదు. జిల్లాలో ఉన్న 34 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు విన్నవించినట్లు తెలిసింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల జరిగితే, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నట్లు సమాచారం.