నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన లైంగిక దాడి కేసులో మహ్మద్ (ఏ1), ఇషాక్ఖాన్ (ఏ2)లకు 30 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జి.ఉదయ్భాస్కర్రావు బుధవారం తీర్పు చెప్పారు. అలాగే రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. బాధిత బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం అందించాలని హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమాదేవి కథనం ప్రకారం.. ఎనిమిదేండ్ల బాలికపై ఇద్దరు నిందితులు లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2022లో అధికారులు కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం, ఈ విషయం ఎవరికైనా చెబితే అం-తుచూస్తామని నిందితులు బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాధిత బాలిక ఇంటిపక్కనున్న పాత ఇనుప సామాన్ల దుకాణంలో పనిచేస్తున్న మొదటి నిందితుడి బాలికపై తొలుత అఘాయిత్యం చేశాడని, కొంతకాలంగా వరుసగా దాడికి పాల్పడ్డాడని, రెండో ముద్దాయి సైతం బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు వివరించారు.
కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టి బాలిక వాంగ్మూలం నమోదు చేశారు. ఫోరెన్సిక్ మెడికల్ రిపోర్టు, సేకరించిన సాక్ష్యాధారాలను జోడించి కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన పోక్సో కోర్టు నిందితులు నేరం చేసినట్టు రుజువు కావడంతో శిక్షను ఖరారు చేసినట్టు తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించని సమక్షంలో అదనంగా 6నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో సూచించారు. నిందితులిద్దరినీ చంచల్గూడా జైలుకు తరలించారు. హైకోర్టులో అపీలు దాఖలుకు అవకాశం కల్పిస్తూ పోక్సోకోర్టు వెసలుబాటు కల్పించింది.