సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కొత్తగా వెలుస్తున్న కాలనీలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా ప్రాంతాల వారీగా జీహెచ్ఎంసీ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్లు రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించి ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ల కోసం ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్)ను స్వీకరిస్తున్నది. ఆపై స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఏరియా డెవలప్మెంట్ ప్లాన్లు సిద్ధం చేస్తారు. ల్యాండ్ యూజ్, నాలాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మెట్రో మార్గానికి కనెక్టివిటిగా ఉండేలా మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ తదితర వివరాలతో ప్లాన్లు రూపొందించనున్నారు. రాబోయే రోజుల్లో సులభతరంగా నిర్మాణ రంగ అనుమతులు, భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేయనుంది.