సిటీ బ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఉన్న జవహర్నగర్ డంపింగ్ యార్డుతో పాటు మరో మూడింటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని సిద్ధాపూర్, అబ్దుల్లాపూర్ మెట్, సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే సిద్ధాపూర్లో 4వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకునేందుకు ప్రముఖ రామ్కీ సంస్థకు 86 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల దశలో ఉంది. తాజాగా అబ్దుల్లాపూర్మెట్, ప్యారానగర్లోనూ అదే రామ్కీ సంస్థకు భూమిని కేటాయించేందుకు వేగంగా అడుగులు పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డును తరలించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో మరో 3 ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామంటున్న ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే ఇవేమీ పట్టని సర్కార్ వీలైనంత తొందరగా నూతన డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.