ఖైరతాబాద్, ఫిబ్రవరి 25: 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీసీ నేత సీఎం అవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ సంఘాల జేఏసి, బీసీ మేధావుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులుతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యయ, పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలన్నారు.
ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధి నరేందర్ రెడ్డి ఓడిపోతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. నరేందర్ రెడ్డి ఓడిపోతాననే భయంతో ఓట్లను నోట్లతో కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని విమర్శించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు పంచిపెట్టారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి అవకాశవాది అని, అతనికి వ్యాపారం తప్ప సేవా గుణం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లు తమ ఓట్లు అమ్ముకునే స్థితిలో లేరని, ఎవరెన్నీ కుట్రలు చేసినా అంతిమంగా బీసీ అభ్యర్థి ఎమ్మెల్సీ అవుతారని పేర్కొన్నారు.
బీసీ రాజ్యాధికారం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతుందని, ఎమ్మెల్సీల గెలుపు 2028 ఎన్నికల్లో అధికారానికి నాంది పలుకనుందని తెలిపారు. ఈ ఎన్నికలు 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఐదుశాతం ఉన్న అగ్రవర్ణాలకు మధ్య జరుగుతుందని, మొదటి ఓటు నుంచి చివరి ఓటు వరకు బీసీలకే వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ సంఘాల జేఏసి ఆధ్వర్యంలో రూపొందించిన బీసీల బహిరంగ లేఖను బీసీ కుల సంఘాల జేఏసి చైర్మన్ కుందారం గణేశ్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేశ్, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేష్ తో కలిసి ఆవిష్కరించారు.