సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన 9వ తేదీ నుంచి నగరంలో నిర్వహించిన విస్తృత తనిఖీలలో సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు, మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినియోగించే నగదు, లిక్కర్, ఇతరత్రా అక్రమ రవాణాను అడ్డుకోవడంపై ఫోకస్ పెట్టామని సీపీ తెలిపారు. నిఘాలో భాగంగానే 7.706 కిలోల బంగారం (రూ. 4.2 కోట్లు), 11,700 కిలోల వెండి (రూ. 8.77 లక్షలు), రూ. 5.1 కోట్ల నగదు, 110 లీటర్ల మద్యం, 23 మొబైల్ ఫోన్స్, 43 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీసులు, ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు, టాస్క్‌ఫోర్స్, ఇతర విభాగాలతో 24/7 చెక్‌పోస్టుల వద్ద పర్యవేక్షణ ఉంటుందని, తమ ప్రాంతాల్లో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సీపీ సూచించారు.
ఎన్నికలు.. తనిఖీలు