హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో అక్రమంగా మత్తు ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న వారిపై హైదరాబాద్ ఈగల్ ఫోర్స్, నల్లగొండ పోలీసులు, డగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్టు చేసి 2,745 స్పస్మో-ప్రాక్సీవోన్ ప్లస్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వెంకట రమణ మెడికల్ స్టోర్ యజమాని దారం కృష్ణసాయి, మత్తు ట్యాబ్లెట్ల సరఫరాదారు షేక్ ఫిరోజ్ అలియాస్ జునైద్, వినియోగదారులు అహ్మద్ అబ్దుల్ హఫీజ్, షేక్ ఒవైస్, షేక్ అఫ్రోజ్, మహమ్మద్ జావిద్, పెడ్లర్ మహమ్మద్ జబీనుల్లా ఉన్నారని, వారిపై కేసులు నమోదు చేశామని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మంగళవారం వెల్లడించారు. మిగిలిన వినియోగదారులు పరారీలో ఉన్నట్టు తెలిపారు.