సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): సిటీని డ్రగ్స్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్, శాంతి భద్రతల పోలీసులు సంయుక్తంగా నిఘాను కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ప్రత్యేకంగా గంజాయి, కొకైన్, ఎండీఎంఏ తదితర డ్రగ్స్ విక్రయాలపై కొరడా ఝళిపిస్తున్నారు. నిరంతరం రూట్ వాచ్ చేస్తూ.. డ్రగ్స్ విక్రేతలను పట్టుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం రెండు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎక్సైజ్ పోలీసులు మరింత దూకుడు పెంచి.. గంజాయి విక్రేతలను పట్టుకున్నారు. ప్రధానంగా గంజాయికి కేంద్రంగా ఉండే దూల్పేట్, మంగళ్‌హాట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులతో కలిసి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.
48 కేసులు
2021లో 48 కేసులు నమోదు చేసి.. 87 మందిని పట్టుకున్నారు. 26 వాహనాలను సీజ్ చేశారు.
పట్టుకోవడం ఖాయం..
డ్రగ్స్ విక్రేతలపై ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక నిఘాను కొనసాగిస్తున్నది. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. సిటీలో డ్రగ్స్ లేకుండా చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖతో కలిసి పనిచేస్తున్నాం. మత్తు పదార్థాల విక్రేతలతో పాటు, గంజాయి వాడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఎదురయ్యే అనర్థాల గురించి వివరిస్తున్నాం. హైదరాబాద్‌లోకి ఎవరైనా డ్రగ్స్ తీసుకొస్తే పక్కాగా పట్టుకోవడం ఖాయం.