Hyderaba Metro | సిటీబ్యూరో, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు హైదరాబాద్ మహానగరంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు మరో అడుగు ముందుకు పడింది. నగరం విస్తరిస్తున్న కొద్ది ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్‌లకు శనివారం రాత్రి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రెండో దశలో 5 మార్గాల్లో మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించే మెట్రో ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24,269 కోట్లు కాగా, అందులో 30 శాతం రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది.
మెట్రో రెండో దశను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు కొంత మేర పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల తర్వాత డీపీఆర్‌ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసింది. కొన్ని నెలలుగా ప్రతిపాదిత మెట్రో మార్గాల్లో మార్పులు, చేర్పులు చేసి చివరకు రెండో దశలో 76.4 కి.మీ మార్గాలను ఖరారు చేశారు. జూన్,జూలై నాటికే డీపీఆర్‌లను పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఫోర్త్ సిటీ పేరుతో ఎంతో కాలయాపన చేసింది. రెండోదశలో మెట్రోలోనే ఫోర్త్ సిటీ మెట్రో మార్గాన్ని 40 కి.మీ మేర నిర్మిస్తామని ప్రకటించిన, చివరకు దాన్ని పక్కన పెట్టింది.
హైదరాబాద్ మహానగరంలో చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరి. అనుమతులన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 5 మెట్రో కారిడార్లకు ఆమోదం ఉంటుందా అన్నది తేలాల్సి ఉంటుంది. అనుమతులకు తోడు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను సైతం కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఒకేసారి రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయడంతో, ఆ స్థాయిలో నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎంత సమయంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులతో పాటు వేలాది కోట్ల నిధులను కేటాయిస్తున్నా, అవి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం ఎంత వరెకు సహకరిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద మెట్రో ప్రాజెక్టుకు సరిపడా నిధులు కేటాయించలేని పరిస్థితి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది.
నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు 36.8 కి.మీ.
రాయదుర్గం-కోకాపేట నియోపొలీస్-11.6 కి.మీ
ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట- 7.5 కి.మీ
మియాపూర్- పటాన్చెరువు – 13.4 కి.మీ
ఎల్బీనగర్ – హయత్‌నగర్ – 7.1 కి.మీ