మేడ్చల్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ నెలాఖరులోగా ప్రారంభం సాధ్యమయ్యేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో అదనంగా మరో 24 ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. నూతన పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి భవనాలు సిద్ధంగా లేని నేపథ్యంలో ప్రభుత్వ భవనాలను గుర్తించే పనిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. ప్రభుత్వానికి చెందిన ఇతర భవనాలు, కమ్యూనిటీ హాళ్లను గుర్తించి ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు విద్యాశాఖకు ఇబ్బంది కరంగా మారింది.
అంతేకాకుండా అద్దె భవనాలను సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి విధి విధానాలు రాలేదని, దీంతో ప్రభుత్వ ఇతర శాఖలకు చెందిన నిరుపయోగంగా ఉన్న భవనాలను గుర్తించి పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలు కష్టతరంగా కనిపిస్తుంది. ఒక వేళ ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నా.. అందులో సౌకర్యాలు లేకపోతే ఎలా పాఠశాల నిర్వహణ ఎలా కొనసాగించాలన్నా అనుమనాలు వ్యకమవుతన్నాయి. ఈ నెలాఖరు వరకు అంటే గడువు కూడా సమీపంలో ఉన్న క్రమంలో భవనాలు గుర్తించే పని పూర్తయితే తప్ప.. పాఠశాలలు ప్రారంభించడం అంత సులువుగా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైట్ టూ యాక్ట్ 2009 ప్రకారం ఒక కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాలను స్థాపించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే జిల్లాలో 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేసింది. కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు అవసరం ఉంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ భవనాలు గుర్తిస్తున్నప్పటికీ ఇందులో సౌకర్యాల లేకపోవడంతో పాఠశాలలు ప్రారంభించే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాఠశాలల నిర్వహణకు కనీసం అద్దె భవనాలకు సంబంధించి విధి విధానాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొంత మేరకైనా ఇబ్బందులు తొలిగే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయాలను విద్యాశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ పెరిగింది. చదువులో నాణ్యత, పాఠశాలలో 12 అంశాలతో కూడిన సౌకర్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన క్రమంలో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి నమ్మకం ఏర్పడింది. దీంతో ఆనాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.