సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): సామాన్య ప్రజల నుంచి వ్యాపారంలో పెట్టుబడులు పెడ్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని ఆ తర్వాత మోసం చేసిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇద్దరిని మలక్‌పేటలో అరెస్ట్ చేశారు. అర్బన్ మార్కెట్ అండ్ అదర్స్ పేరిట ఆన్లైన్ గ్రాసరీ యాప్ పేరుతో బాధితుల నుంచి రూ.24.36 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ చౌదరి, మహారాష్ట్రకు చెందిన అమిత్‌కుమార్ పిలానియాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో అమిత్‌కుమార్ పిలానియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ పోలీసులు ఆ తర్వాత ఫిర్యాదుదారు, నిందితుడితోపాటు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత సీఏతో చర్చించి ఫిర్యాదుదారుడైన అమిత్‌కుమార్ కూడా నిందితుడేనని నిర్ధారించి అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.