సిటీబ్యూరో, మే 12, (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.23.84 కోట్ల నగదును ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
రూ. 26.03 కోట్ల విలువ చేసే ఇతర వస్తువులు, 27,715.965 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. 356 మందిపై కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 727 ఫిర్యాదులు రాగా, వాటిని పరిష్కరించారని, 472 మందిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తాజాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.65,18,700 నగదు, రూ.5.36 లక్షల విలువ చేసే వస్తువులను పట్టుకొని సీజ్ చేసినట్లు చెప్పారు.