Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మహానగరం రోజు రోజుకు వేగంగా విస్తరిస్తున్నది. కోర్ సిటీలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు వరకు సులభంగా చేరుకునేందుకు ఇరువైపులా మెరుగైన రోడ్ నెట్వర్క్ కల్పించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మియాపూర్ నుంచి బాచుపల్లి మీదుగా దుండిగల్ వెళ్లే మార్గంలో బాచుపల్లి చౌరస్తా నుంచి మల్లంపేట, బౌరంపేట మార్గాల్లో రోడ్లను విస్తరించడంతో పాటు ఓఆర్ఆర్పై కొత్తగా రెండు ర్యాంపులను నిర్మిస్తోంది. ఈ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. పటాన్చెరువు-దుండిగల్ మధ్య ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై సుల్తాన్‌పల్లి వద్ద ఒక ఇంటర్చేంజ్ ఉంది. మల్లంపేట చుట్టు పక్కల ఉండే వారు ఓఆర్ఆర్పైకి వెళ్లాలంటే సుల్తాన్‌పల్లి, లేదా పటాన్ చెరు వరకు వెళ్లాల్సి వస్తోంది. ఇది దూరమవుతున్న క్రమంలో మల్లంపేట వద్ద ఓఆర్ఆర్పై పైకి ఎక్కేందుకు, కిందకు దిగేందుకు ర్యాంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 22 వ ఈ ఇంటర్‌చేంజ్‌ను రూ.31.80 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఓఆర్ఆర్ దాటి శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా నగరానికి పడమర దిక్కున ఐటీ కారిడార్‌లో ఓఆర్ఆర్ను దాటి మోకిల, శంకర్పల్లి వరకు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రక్కనే ఉన్న పటాన్చెరు, ఇస్నాపూర్, సుల్తాన్‌పల్లి, మల్లంపేట, బాచుపల్లి ప్రాంతాల్లోనూ నూతన నివాసాలు వెలుస్తున్నాయి. దీనికి అనుగుణంగా శివారులో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు ఓఆర్ఆర్ పై అవసరమైన చోట కొత్తగా ఇంటర్‌చేంజ్‌లను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఓఆర్ఆర్పై మూడు చోట్ల కొత్తగా ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణం జరుగుతుండగా, అందులో ఒకటి మల్లంపేటలో ఉంది. మల్లంపేట చుట్టు ప్రక్కల ఉన్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ పైకి ఎక్కేందుకు, దిగేందుకు రెండు ర్యాంపులను నిర్మిస్తున్నది. దీంతో పాటు అక్కడి నుంచి బాచుపల్లి, నిజాంపేట ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిని సైతం బాచుపల్లి చౌరస్తా నుంచి బౌరంపేట వరకు 6 కి.మీ మేర విస్తరిస్తున్నారు. ఈ పనులు సైతం హెచ్ఎండీఏ చేపడుతోంది.
గ్రేటర్ చుట్టూ 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పై ప్రస్తుతం 19 ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి వేగంగా జరుగుతుండటంతో సమీప ప్రాంతాల నుంచి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకాపేట, కొల్లూరు, వట్టి నాగులపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో కోకాపేట, నార్సింగి ప్రాంతాల్లో కొత్తగా 2 ఇంటర్‌చేంజ్‌లను నిర్మిస్తున్నారు. అలాగే పటాన్చెరు – మేడ్చల్ జాతీయ రహదారుల మధ్య ఉన్న ప్రాంతాల్లో రద్దీ దృష్ట్యా మల్లంపేట వద్ద ఓఆర్ఆర్ పై రెండు ర్యాంపులను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.