దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఎస్ఆర్డీపీలో 36వ ప్రాజెక్టుగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌బ్రిడ్జిని శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే భూసేకరణ లేకుండా రూ. 450 కోట్లతో మెట్రో రైలు పైనుంచి నిర్మించిన ఈ ఉక్కువంతెనకు తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ గురువారం తెలియజేశారు.
మహా నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏటేటా నగరానికి కొంగొత్త సొబగులు అలముకుంటున్నాయి. పాలకులు నగరాన్ని విశ్వ వేదికపై మిరుమిట్లు గొలిపే సరికొత్త తారలాగా తీర్చిదిద్దుతున్నారు. అత్యాధునిక వసతులతో ప్రజలకు నగరాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ శనివారం అతి పెద్ద ఉక్కు వంతెనను ప్రజలకు చేరువులోకి తీసుకొస్తున్నారు. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ట్రాఫిక్, రవాణాలో చోటు చేసుకుంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రూ.450 కోట్లను వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్టీల్ బ్రిడ్జీని నిర్మించింది. కాగా, ఈ బ్రిడ్జీ రేపు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ఆవిష్కరించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర సిగలోకి మరో మణిహారం చోటు చేసుకోబోతున్నది. నగరం అంటేనే.. వింతలు, విచిత్రాలు, బహుళ అంతస్థుల భవనాలు, ఫ్లై ఓవర్లు, అత్యాధునిక వసతుల అమరిక. అభివృద్ధిలో నగరం రోజు రోజుకు దూసుకుపోతున్నది. ఎస్ఆర్డీపీలో మరో అరుదైన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువస్తున్నది. నగరంలో అతిపెద్ద ఉక్కు వంతెనను ఇందిరా పార్క్ నుంచి-వీఎస్టీ వరకు ప్రభుత్వం నిర్మించినది. సివిల్ వర్క్స్, యుటిలిటీ లిఫ్టింగ్, ఇతర ఖర్చులతో కలిపి రూ. 450 కోట్లతో ఈ స్టిల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ ఫ్లై ఓవర్‌ను శనివారం పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించనున్నారు.
ఎస్ఆర్డీపీలో 48 ప్రాజెక్టులు చేపట్టగా.., ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులయ్యాయి. వీఎస్టీ ఫ్లై ఓవర్ 36వది. అయితే, వాటిలో 19 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్యూబీ, ఒక కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రహదారి, ఓఆర్ఆర్ మెదక్ రోడ్ ఉంది. కాగా, 20వ ఫ్లై ఓవర్‌గా స్టీల్ బ్రిడ్జి నిలవనుంది. ఎస్ఆర్డీపీలో ఫ్లై ఓవర్ అవసరాన్ని బట్టి స్టీల్‌ను వినియోగించారు. బంజారాహిల్స్ శ్మశాన వాటిక, మల్కం చెరువు సమీపంలో చేపట్టిన వంతెనకు కొంత మేరలో స్టీల్ వినియోగించగా.. ఈ ఫ్లై ఓవర్‌కు దాదాపు 20 మె ట్రిక్ టన్నుల ఉక్కును వాడారు. దక్షిణాదిన మొదటి పొడవైన వంతెన ఇది కావడం గమనార్హం. అంతే కాకుండా జీహెచ్ఎంసీ చరిత్రలో భూసేకరణ లే కుండానే నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. హైదరాబాద్‌లో మై ట్రో రైల్ మార్గం మీదుగా నిర్మించిన ఫ్లై ఓవర్ కావడం మరో విశేషం. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, తా ర్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామంతపూర్, ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ ఫ్లై ఓవర్‌కు దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది.
ప్రయోజనాలు
ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ స్టీల్ బ్రిడ్జీ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్)తో రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నది.
గతంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండేది. ఈ ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఓయూ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది.
ఇందిరా పార్కు, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, బాగ్ లింగంపల్లి క్రాస్ రోడ్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది.