గురువారం 28 మే 2020
Hyderabad - Apr 27, 2020 , 00:24:43

గ్రేటర్‌లో 11 పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో 11 పాజిటివ్‌ కేసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ రెండుమూడు రోజులకోసారి హెచ్చుతగ్గులు కనిపిస్తుండడంతో పరిస్థితిపై ఇప్పుడే ఎలాంటి అంచనా వేయలేమంటున్నారు వైద్యనిపుణులు. మరో రెండు మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈనెల 24న గ్రేటర్‌ వ్యాప్తంగా కేవలం 2 కేసులు మాత్రమే నమోదవగా 25న 6 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం మరో 11కే సులు నమోదయ్యాయి. నమోదైన 11కేసులు కేవలం హైదరాబాద్‌ నగరంలోనే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఆ కుటుంబంలో..మరో ఐదుగురికి..

మల్లాపూర్‌ : కాప్రా సర్కిల్‌ వేంకటేశ్వరనగర్‌లో మరో ఐదుగురికి  కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరందరూ శనివారం కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులే.  మృతుడి భార్య, కుమారుడు, కూతురు, అల్లుడితో పాటు ఏడాదిన్నర వయసున్న అతడి మనువరాలికి పాజిటివ్‌గా తేలింది.

ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌లో ఒకరికి..

మల్కాజిగిరి, నమస్తే తెలంగాణ : ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌లో 35 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ నెల 24న  జ్వరం రావడంతో అతడు ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు.  ఓల్డ్‌నేరేడ్‌మెట్‌ రామాలయం సమీపంలోని నియంత్రిత  ప్రాంతంలో మేడ్చల్‌ జాయింట్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌, డీసీ దశరథ్‌, ఇన్‌స్పెక్టర్‌ నర్సింహస్వామిలు పర్యటించారు.

రామంతాపూర్‌లో మరో ఇద్దరికి..

ఉప్పల్‌, నమస్తే తెలంగాణ : రామంతాపూర్‌లోని చర్చికాలనీ, శ్రీరమణపురంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబంలో మరో ఇద్దరికి  పాజిటివ్‌గా తేలింది. 

కంటైన్‌మెంట్‌ ఎత్తివేత..

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 3లోని షౌకత్‌నగర్‌, ఫిలింనగర్‌ సమీపంలోని హకీంపేట, జ్ఞానీజైల్‌సింగ్‌నగర్‌లో ఆదివారం నుంచి కంటైన్‌మెంట్‌ ఎత్తివేశారు. కొత్తకేసులు రాకపోవడం, బాధితులు కోలుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అల్వాల్‌ పరిధిలో..

అల్వాల్‌: రాజీవ్‌గాంధీనగర్‌ -1, 2, జానకీనగర్‌, చంద్రానగర్‌, హస్మత్‌పేట్‌లో కంటైన్‌మెంట్‌ ఎత్తివేశారు. ప్రస్తుతం అల్వాల్‌  పరిధిలోని శ్రీనివాసనగర్‌ మాత్రమే కంటైన్‌మెంట్‌ జోన్‌గా కొనసాగుతున్నది.   

పటిష్టంగా బారికేడ్లు

సికింద్రాబాద్‌, నమస్తేతెలంగాణ :  నియంత్రిత ప్రాంతాల్లో పటిష్టంగా బారికేడ్ల ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ఆదేశించారు. కేవలం కర్రలు అడ్డుపెడితే సులువుగా ప్రధాన మార్గాలకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు.

‘నియంత్రిత’ంలో నిరంతర సేవలు

మెహిదీపట్నం : నియంత్రిత ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. నాంపల్లి, కార్వాన్‌ నియోజకవర్గాల్లోని నియంత్రిత ప్రాంతాల్లో పోలీసులు ప్రతి రోజూ సేవలందిస్తున్నారు.


logo