మంగళవారం 26 మే 2020
Hyderabad - Mar 27, 2020 , 23:18:18

నిరాశ్రయుల కోసం 131 చోట్ల షెల్టర్లు

నిరాశ్రయుల కోసం 131 చోట్ల షెల్టర్లు

  • నగరవ్యాప్తంగా ఫుట్‌పాత్‌లపైన 760 మంది నిరాశ్రయుల గుర్తింపు 
  • గూడునిచ్చి భోజనం పెట్టేలా వసతులు
  • అనారోగ్యానికి గురైన వారికి వైద్య సౌకర్యం, ఉచితంగా మందులు
  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసిన బల్దియా అధికారులు 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో చిక్కుకుపోయిన నిరాశ్రయులకు 131 కేంద్రాల్లో బస కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు గురువారం రాత్రి నగర వ్యాప్తంగా సర్వే నిర్వహించి 760 మంది నిరాశ్రయులను గుర్తించారు. వారికి షెల్టర్లలో బస కల్పిస్తున్నారు. వీరికి భోజనం, వసతి సౌకర్యాలే కాకుండా అనారోగ్యంతో ఉన్నవారికి సమీపంలోని దావాఖానల్లో వైద్యం, మందులు కూడా అందించడానికి  సన్నాహాలు చేశారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వివిధ పనులకోసం నగరానికి వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయినవారు, వైద్యం కోసం వచ్చినవారు, పనులులేక పస్తులుంటున్నవారికోసం జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గూడులేక ఫుట్‌పాత్‌లు, మెట్రోరైలు స్టేషన్ల కింద కాలం వెళ్లదీస్తున్న ఇటువంటివారికోసం 131షెల్టర్లను సిద్ధం చేసింది. పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు ఆదేశాల ప్రకారం గురువారం రాత్రి నగరవ్యాప్తంగా సర్వే నిర్వహించిన అధికారులు వివిధ ప్రాంతాల్లో 760మంది నిరాశ్రయులను గుర్తించి అందరినీ సమీపంలోని షెల్టర్లకు తరలించారు. 

మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు..

 లాక్‌డౌన్‌ అనంతరం పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నగరవ్యాప్తంగా పర్యటించిన మంత్రి కేటీఆర్‌, నగరంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం విధితమే. అంతేకాదు, ఈ అంశంపై గురువారం ఆయన ఓ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించి ఇతర రాష్ర్టాలనుంచి వచ్చినవారు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నవారిని కూడా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, ఫుట్‌పాత్‌లు, మెట్రో స్టేషన్ల కింద ఉంటున్నవారిని గుర్తించేందుకు గురువారం రాత్రి జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీలోని 30సర్కిళ్లలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో 760మంది నిరాశ్రయులని గుర్తించారు. మరోవైపు, నిరాశ్రయులను సురక్షితంగా ఉంచడంతోపాటు వారికి భోజనం, ఇతర సౌకర్యాలు అందించేందుకు షెల్టర్లను కూడా గుర్తించారు. నగరంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 12షెల్టర్‌ హోమ్‌లు కొనసాగుతుండగా, ఐదు ప్రధాన దవాఖానల్లో మరో ఐదు షెల్టర్‌హోమ్‌లు ఉన్నాయి. ఈ 17కాకుండా ప్రైవేటు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మరో 114షెల్టర్‌ హోమ్‌లను గుర్తించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని షెల్టర్‌హోమ్‌లలో ఇదివరకే కొందరు ఉంటుండగా, ఉస్మానియా, నిలోఫర్‌, ఈఎన్‌టీ, తదితర పెద్దాసుపత్రులవద్ద ఏర్పాటు చేసిన షెల్టర్‌హోమ్‌లలో రోగులు, వారి వెంట వచ్చినవారు ఉంటున్నారు. కాగా, కొత్తగా గుర్తించిన ప్రైవేటు షెల్టర్‌హోమ్‌లతోపాటు జీహెచ్‌ఎంసీకి చెందిన షెల్టర్‌ హోమ్‌లకు ఈ 760మందిని తరలించారు. 

నేడు మరోసారి సర్వే..

 నిరాశ్రయులను గుర్తించేందుకు శుక్రవారం రాత్రి కూడా సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల గురువారం సర్వే సందర్భంగా ఒకవేళ ఎవరైనా కనిపించకపోయినా శుక్రవారం వారిని గుర్తించే వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.

సహాయం అందించేందుకు ముందుకొస్తున్న ఎన్‌జీఓలు..

 షెల్టర్‌హోమ్‌లకు తరలించేవారికి భోజనం సరఫరా చేసేందుకు ఇప్పటికే నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వారు భోజనం సమకూర్చేందుకు అంగీకారం తెలిపారు. కాగా, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బియ్యం, పప్పులు, ఇతర ఆహార సామగ్రి, బట్టలు, మందులు తదితర వాటిని అందించేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు, గురువారం నుంచే అన్నపూర్ణ కేంద్రాల వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన విషయం విధితమే. సమీపంలోని షెల్టర్‌హోమ్‌లలో ఉంటున్నవారికి ఈ కేంద్రాల ద్వారానే భోజనం సరఫరా చేయగా, దూరంగా ఉన్న షెల్టర్‌ హోమ్‌లకు బియ్యం, ఇతర ఆహార సామగ్రిని సరఫరా  చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అన్నపూర్ణ కేంద్రాల వద్ద రాత్రి భోజనం కూడా సరఫరా చేస్తున్నారు.


logo