మహేశ్వరం, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్లో చేరికల పర్వం కొనసాగుతున్నది. తాజాగా శుక్రవారం మహేశ్వరం మండలం ఎన్డీ, దయాలగుండు తండాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 200 మంది మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన మంత్రి.. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలుస్తున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్డీ తండా, దయాలగుండు తండాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు అంగోతు గోపాల్‌నాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు రమావత్ గోపాల్‌నాయక్, ఉపసర్పంచ్ ఉర్మిళ రవినాయక్, యూత్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో 200మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి సబితారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు చేరుతున్నాయని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.