మేడ్చల్, జూలై 25(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి నోచుకోవడం కష్టంగా కనిపిస్తుంది. పాఠశాలలను ఈ నెల చివరి వారం వరకు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటి వరకు రెండు ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 22 పాఠశాలలు ప్రారంభానికి నోచుకోవడం అనుమానంగా ఉంది.
ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీహాళ్లు, కాలనీల్లో అసోసియేషన్ భవనాలను విద్యాశాఖ గుర్తించింది. అయితే నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటు కమ్యూనిటీహాళ్లలో పాఠశాలల నిర్వహణకు కనీస మౌలిక వసతులు లేవు. దీంతో పాఠశాలల ఏర్పాటుకు 12 భవనాలను గుర్తించిన పాఠశాలలను ప్రారంభించేందుకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కీసర, బాలానగర్ లలో రెండు పాఠశాలలు ప్రారంభించారు.
నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీహాళ్లలో కనీస సదుపాయాలు లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి విద్యాశాఖ తీసుకువచ్చిన ఫలితం కనపడటం లేదు. వాష్రూమ్, తాగునీటి, విద్యుత్ సౌకర్యంతో పాటు భవనాలకు రంగులు వేయాలని కోరిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఇలా సౌకర్యాలు లేకుండా పాఠశాలలు ఎలా నిర్వహించేది అనేది విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. పాఠశాలల నిర్వహణకు అద్దె భవనాలైన తీసుకొని నిర్వహించాలన్నా అద్దె భవనాలు తీసుకునే విధివిధానాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీహాళ్లలో నిర్వహణపై విద్యాశాఖ పెదవి విరుస్తుంది.
పాఠశాలల ప్రారంభంలో అధికారుల మధ్య సమన్వయ లోపం లేకనే ప్రారంభానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది. భవనాల్లో సౌకర్యాలు వివిధ మరమ్మతులపై జిల్లా ఉన్నతాధికారులు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లే పట్టించుకోవడల లేదని తెలుస్తోంది. ఈ నెల చివరి వారం వరకు మిగతా 22 పాఠశాలలు ప్రారంభించాల్సి ఉండగా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం వల్లే పాఠశాలలు ప్రారంభమయ్యేలా కనిపించడం లేదని విద్యాశాఖ అధికారులు గుసగుసలాడుతున్నారు. 20 మంది విద్యార్థులు ఉంటే ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాలన్న చట్టం మేరకే పాఠశాలలను మంజూరు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.