బంజారాహిల్స్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : మీరు బంజారాహిల్స్ రోడ్ నం. 14 మీదుగా ప్రయాణిస్తున్నారా..? అయితే జర జాగ్రత్త..రెండు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న ఆ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తున్నారు. తమ వెన్నుపూస దెబ్బతినడం ఖాయమని..వాపోతున్నారు. నగరం నడిబొడ్డున పలువురు ప్రముఖులు, అధికారులు నిత్యం ప్రయాణించే బంజారాహిల్స్ రోడ్ నం. 14 రహదారి అధ్వానంగా మారింది.
రెండు నెలలుగా భారీ వర్షాలతో రోడ్డు మొత్తం ఛిద్రమైనా.. బల్దియా అధికారులు మరమ్మతుల మాటే ఎత్తడం లేదు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తోంది. బంజారాహిల్స్‌లోని శబ్దాలయ రికార్డింగ్ స్టూడియో నుంచి రోడ్ నం. 7లోని మీసేవా కేంద్రం దాకా సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉండగా, 80 శాతం రోడ్డు గుంతలమయమైంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వర్షాకాలంలో రోడ్లపై గుంతలు పడితే తక్షణ మరమ్మతు బృందాలతో పూడ్చేయించేవారు. అయితే ఈ బృందాలన్నీ హైడ్రా ఆధీనంలో పనిచేస్తుండడంతో ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు చేయించే అవకాశం లేకుండా పోతోందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద రోడ్ నం. 14లో ప్రయాణించే వారి వెన్నెముకలు విరిగే పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.