Ganja | బండ్లగూడ మార్చి 5 : ఒడిశా కేంద్రంగా గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు చేపడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు. శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ఎండెడ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ కుమార్, గజన్‌లాల్ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ కొన్ని రోజులుగా కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించారు. కానీ సరిపడా డబ్బులు రాకపోవడంతో.. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అమ్మకంపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో గజన్‌లాల్ ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్‌లోని ప్రదీప్‌కు సరఫరా చేసేవాడు. ప్రదీప్ వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి రూ. 150లకు రిటైల్ షాపులలో అమ్మకాలు చేస్తున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ ఆదేశాలతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఫక్రుద్దీన్, మల్లేష్, నెహ్రూ, గణేష్, నిఖిల్, సాయి శంకర్ ఆరాంఘర్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో గజన్ లాల్, ప్రదీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 2.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని మరిన్ని వివరాల కోసం వారిని విచారిస్తున్నారు.