ఏపీలోని కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాద ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో కాలి బూడిదైన వేమూరి కావేరి ట్రావెల్స్.. ప్రైవేట్ బస్సుల దందా, ఆర్టీఏ అవినీతిని బట్టబయలు చేసింది. ప్రమాదానికి గురైన బస్సు పర్మిట్ లేదు. ఫిట్నెస్ లేదు. పొల్యుషన్ సర్టిఫికెట్ లేదు. ఈ బస్సుపై 16 చలాన్లు ఉన్నాయి. సీటింగ్ బస్సును స్లీపర్‌గా మార్చారు. డామన్ అండ్ డయ్యూలో రిజిస్టర్ అయిన బస్సును తెలుగు రాష్ర్టాల్లో తిప్పుతున్నారు. ఇలా అనేక నిబంధనలు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఉల్లంఘించింది. అయినా, ఆర్టీఏ అధికారులు ఎవరూ ఈ బస్సును రోడ్డు ఎక్కకుండా నిలువరించలేకపోయారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే, తనిఖీలు చేపట్టకపోవడం వల్లనే గురువారం రాత్రి కర్నూలు జిల్లాలో ఈ బస్సు ప్రమాద ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మహిళలు, పిల్లలు, యువ టెకీల భవిష్యత్తు ఆర్టీఏ పర్యవేక్షణ లేమితో బుగ్గిపాలైంది.
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాద ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో కాలి బూడిదైన వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సుల దందా, ఆర్టీఏ అవినీతిని బట్టబయలు చేసింది. ప్రమాదానికి గురైన బస్సుకు పర్మిట్ లేదు, ఫిట్నెస్ లేదు, పొల్యుషన్ సర్టిఫికెట్ కూడా లేదు. ఈ బస్సుపై 16 ఛలాన్లు ఉన్నాయి. సీటింగ్ బస్సును స్లీపర్‌గా మార్చారు. డామన్ అండ్ డయ్యూలో రిజిస్ట్రర్ అయిన బస్సును తెలుగు రాష్ర్టాల్లో తిప్పుతున్నారు. ఇలా అనేక నిబంధనలు ఉల్లంఘించిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు రోడ్డు ఎక్కకుండా ఆపలేకపోయారు. అధికారులు నిర్లక్ష్యంతో తనిఖీలు చేపట్టకపోవడం వల్లనే గురువారం రాత్రి కర్నూలు జిల్లాలో ఈ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మహిళలు, పిల్లలు, యువ టెకీల భవిష్యత్తు ఆర్టీఏ పర్యవేక్షణ లోపంతో బుగ్గిపాలైంది.
ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (నంబర్ DD01N9490) డామన్ అండ్ డయ్యూలో 2018లో రిజిస్టర్ అయింది. కానీ, ఈ బస్సును రోజూ హైదరాబాద్-బెంగళూరు మధ్య తిప్పుతున్నారు. అన్ సీజన్లో తెలుగు రాష్ట్రాలతోపాటూ కర్ణాటక, ఒడిశాలోనూ తిప్పుతున్నారు. కావేరి ట్రావెల్స్ ఒక్కటే కాదు, అనేక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉత్తర భారతదేశంలో రిజిస్ట్రరై, దక్షిణ భారతంలో ఎలాంటి అనుమతులు లేకుండా తిరుగుతున్నాయి. ఇది రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్డీఏ అధికారుల సమన్వయ లోపాన్ని, ఆ శాఖలో వేళ్లూనుకున్న అవినీతిని వెల్లడిస్తున్నది. అధికారులు లంచాలు తీసుకుని ఇలాంటి వాహనాలకు క్లియరెన్స్ ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రమాదానికి గురైన బస్సుపై 16 ట్రాఫిక్ ఉల్లంఘన ఛలాన్లు ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సుపై నో-ఎంట్రీ జోన్లోకి ప్రవేశం, స్పీడ్ లిమిట్ దాటడం వంటి అనేక కేసులు నమోదయ్యాయి.
ఫైన్ విలువ రూ.23,120. బైక్‌పై రెండు ఛలాన్లు ఉంటే రోడ్డుపై ఆపి ముక్కుపిండి వసూలు చేసే ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఇలాంటి వాహనాలను మాత్రం పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, అడ్డగోలు పార్కింగ్, అతివేగంగా బస్సు నడుపడం.. అంటే ఆర్టీఏ విధించే దాదాపు అన్ని నిబంధనలను బస్సు డ్రైవర్లు ఉల్లంఘించారు. అయినా, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ట్రావెల్స్ బస్సు రోడ్డు ఎక్కి ప్రయాణికుల మరణానికి కారణమైంది. ఇదొక్క కావేరి ట్రావెల్స్ బస్సుకే పరిమితమైన ఉల్లంఘనలు కావు. దేశంలోని అనేక ప్రైవేటు వాహనాలు, ట్రావెల్స్ బస్సుల పరిస్థితి ఇలాగే ఉన్నా.. ముడుపులు తీసుకొని కొందరు ఆర్టీఏ అధికారులు అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఒక వాహన డ్రైవర్‌కు లైసెన్స్ ఎంత ముఖ్యమో.. ఒక వాహనానికి ఫిట్నెస్, పర్మిట్, పొల్యూషన్, ఇతర అనుమతుల సర్టిఫికెట్లు అంతే ముఖ్యం. అయితే, కావేరి ట్రావెల్స్ బస్సుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా రోడ్డెక్కి ప్రయాణికుల ప్రాణాలు తీసుకున్నది. ఈ బస్సుకు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ గడువు 26 నెలల క్రితం (జూలై 27, 2023) ముగిసింది. ఏఐటీపీ అథారైజేషన్ గడువు కూడా 20 నెలల క్రితమే (ఏప్రిల్ 27, 2024) తీరింది. పొల్యూషన్ వాలిడిటీ 18 నెలల క్రితం, ఫిట్నెస్ వాలిడిటీ, ఇన్సూరెన్స్ వాలిడిటీలు ఆరు నెలల క్రితమే ముగిశాయి. టాక్స్ వాలిడిటీ 18 నెలల క్రితమే ముగిసింది. నాటి నుంచి పన్ను ఎగవేస్తున్నారు ట్రావెల్స్ ఓనర్ వేమూరి వినోద్.
అయినా, బస్సుపై ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదొక్కటే కాదు, ఇలాంటి బస్సులు రోడ్లపై వందల కొద్దీ నిత్యం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గమ్యం చేరకముందే గాలిలో కలిసిపోతున్నాయి. దేశంలోని అనేక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పరిస్థితి కావేరి బస్సు లాగే ఉన్నది. పర్మిట్ల గడువు ముగిసినా, వాహనాలు లోపభూయిష్టంగా ఉన్నా, ఫిట్‌గా లేకపోయినా, పన్నులు ఎగవేసినా ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
మామూళ్లు తీసుకొని ఇలాంటి వాహనాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో అవినీతిలో ఆర్టీఏనే టాప్ వన్‌లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగితే కొన్ని రోజులపాటు హడావుడి చేసే అధికారులు, తర్వాత షరామామూలుగా మారుతున్నారు. ఇదే అదనుగా దండుకొనే అధికారులు కూడా ఉంటున్నారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ దుర్ఘటనలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కఠిన నిబంధనలు లేకపోవడం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలున్నాయి. బస్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకపోవడం, అత్యవసర డోర్లు కూడా జామ్ కావడం, కిటికీ అద్దాలు పగులగొట్టి ఎసేప్ అయ్యే అవకాశాలు ప్రయాణికులకు లేకపోవడం వల్ల తప్పించుకొనే మార్గం లేక నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఒడిశాలోని రాయగడ అధికారులు ఇచ్చారు. కానీ, కావేరి ట్రావెల్స్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా బస్సును స్లీపర్ క్యారియర్‌గా మార్చింది. ఇలా ప్రైవేటు ట్రావెల్స్ మృత్యు శకటాలుగా మారుతున్నాయి.
మనం ఎకడికైనా వెళ్లాలంటే.. బస్సు ఎకుతాం, టికెట్ తీసుకుంటాం. కానీ ఆ బస్సు ఎలాంటిది? దానికి ఫిట్నెస్ ఉన్నదా? మధ్యలో ఎక్కడైనా ఆగిపోతుందా? బ్రేకులు సరిగా పడతాయా? ప్రమాదం జరిగితే.. తప్పించుకోవడానికి వీలవుతుందా? ఇలాంటి విషయాలు మనకు తెలియదు.. ఆ బాధ్యత ఆర్టీఏ అధికారులది. ఆ అధికారులు వాహనాలను, అన్ని రకాల బస్సులనూ చెక్ చేయడం లేదు. అయితే అతిగా తనిఖీలు చేస్తే.. తమను వేధిస్తున్నారని వాహనదారులు అంటున్నారట. అందువల్ల తనిఖీలు తకువగా జరుగుతున్నాయని స్వయంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరే ఇటీవల తెలిపారు. దీంతో గత కొంత కాలంగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాద ఘటనలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. 200-500 కిలోమీటర్లు దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎక్కువగా స్లీపర్ బస్సులు వాడుతున్నారు.
ఈ బస్సులు ఎక్కువగా రాత్రి వేళల్లో తిరుగుతాయి. తెల్లవారేసరికి గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే, స్లీపర్ బస్సుల నిర్మాణం భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటున్నదని నిపుణులు చెప్తున్నారు. ఈ బస్సుల్లో సాధారణంగా 2×1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 40 మంది వరకు ప్రయాణించవచ్చు. బెర్త్‌ల పొడవు 6 అడుగులు, వెడల్పు 2.5 అడుగులు ఉంటుంది. ఈ బస్సుల్లో స్లీపర్ సీట్లు మాత్రమే ఉండటంతో బస్సు మధ్యలో స్థలం చాలా ఇరుకుగా ఉంటుంది. లావుగా ఉండే వ్యక్తి కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి. ఏదైనా ప్రమాదం జరిగితే సులభంగా బయటకు వచ్చే వీలులేకుండా పోతున్నది. మరోవైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరైన ప్రదేశాల్లో లేకపోవడం, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు లేకపోవడం వంటి అంశాలు మృతుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన నేపథ్యంలో 12 ఏండ్ల క్రితం జరిగిన పాలెం బస్సు దుర్ఘటనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నేటి వనపర్తి జిల్లాలోని పాలెం వద్ద 2013 అక్టోబర్ 30న ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4-5 గంటల మధ్యలో జరిగిన ఈ ప్రమాదంలో క్షణాల్లోనే బస్సు మసైపోయింది. శరీరాలు గుర్తు పట్టడానికి కూడా వీలుకాని విధంగా 45 ప్రాణలు బూడిద కుప్పలుగా మారిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మరో గంటలో హైదరాబాద్ చేరుకుంటారనగా జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలచివేసింది. బెంగళూరు హైవేపై జరిగిన ఈ రెండు దుర్ఘటనలు అత్యంత ఘైరమైన రోడ్డు ప్రమాదాలుగా నిలిచిపోతాయి. అప్పుడు జబ్బార్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తూ పకకు వెళ్లడంతో బస్సు డీజిల్ ట్యాంక్ రోడ్డు డివైడర్‌కు ఢీకొని మంటలు రేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు బస్సును చుట్టేసి ఆహుతి చేశాయి.