Hyderabad | హైదరాబాద్ జవహర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొంత భాగం కూడా బయటపడింది. దీంతో తీవ్రగాయాలైన బాలుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి గ్రామానికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులకు విహాన్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. ఏదైనా పని చేసుకుని బతుకుదామని నెల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. జవహర్‌నగర్‌లోని ఆదర్శ్‌నగర్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీ సోదరుడి ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అప్పుడే గుంపులుగా వచ్చిన వీధికుక్కలు ఒక్కసారిగా విహాన్‌పై దాడి చేశాయి. కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాయి.
కుక్కల గుంపును చూసిన ఓ స్థానికుడు అనుమానం వచ్చి వాటి దగ్గరకు వెళ్లి చూడగా.. తీవ్రగాయాలతో పడివున్న విహాన్ కనిపించాడు. ఒళ్లంతా కుక్కగాట్లతో రక్తం కారుతూ ఉంది. ఆ ప్రాంతంలోనే విహాన్ మెదడులో కొంత భాగం కూడా కనిపించింది. దీంతో వెంటనే కుక్కలను తరిమికొట్టిన స్థానికుడు.. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే విహాన్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మద్వైద్యం కోసం గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెనీ విభాగానికి తీసుకెళ్లారు. కానీ కుక్కల దాడిలో ఒళ్లంతా గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విహాన్ మృతి చెందాడు.
కుక్కల దాడిలో విహాన్ మరణించడం స్థానికంగా కలకలం సృష్టించింది. జవహర్‌నగర్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.