మల్కాజిగిరి, ఆగస్టు 16: బ్యాంకులకన్న ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ నమ్మించిన దంపతులు.. దాదాపు రూ.20కోట్ల డబ్బుతో ఉడాయించారు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని సైనిక్‌పురికి చెందిన దినేశ్పాణ్యం, కవితాపాణ్యం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు.
సైనిక్‌పురిలో ఆఫీసులు ఏర్పాటు చేసి.. కవితాపాణ్యం సైకలాజిస్ట్గాగా అవతారం ఎత్తింది. వీరిద్దరు పథకం ప్రకారం.. వృద్ధులు, విశ్రాంతి ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాయ మాటలు చెప్పి, బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామంటూ నమ్మించి.. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. మొదట నెలనెలా వడ్డీ డబ్బులు వారి ఖాతాలో వేయగా.. వారిపై నమ్మకం ఏర్పడింది.
ఈ క్రమంలో దినేశ్పాణ్యం .. తాను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టానని, మంచి లాభాలు వస్తున్నాయని నమ్మించి.. 170మంది నుంచి దాదాపు రూ.20కోట్లు వసూలు చేశాడు.. కాగా.. గత కొన్ని నెలలుగా బ్యాంక్ ఖాతాలో వడ్డీ పడకపోవడంతో వారిని నిలదీశారు. సైనిక్‌పురిలోని కార్యాలయం తెరవకపోవడంతో వారిపై అనుమానం వచ్చింది. దీంతో గత నెల 2న కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు రోజులకు దినేశ్పాణ్యం భార్య కవితాపాణ్యంను బాధితులు సంప్రదించగా.. ఆయనతో తనకు సంబంధం లేదని, విడాకులకు కోర్డులో కేసు వేశానని సమాధానం చెప్పడంతో బాధితులు కంగుతిన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు జగన్నాథరావు, రవి, శ్రీధర్, సతీశ్, సుధాకర్, ఫణి, సూర్యనారాయణలు ప్రభుత్వాన్ని కోరారు.