నేరేడ్మెట్, మే 17 : హైదరాబాద్ నేరెడ్మెట్ పరిధిలో విషాదం నెలకొంది. ఫోన్ ఎక్కువగా చూడకుండా, చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. తమ ఇంటిపై ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగలి శివరాం తనయుడు పాపయ్య (16) గీతం కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. స్మార్ట్ఫోన్కు అలవాటు పడిన పాపయ్య.. ఎక్కువ సమయం మొబైల్లోనే గడిపేస్తున్నాడు. దీంతో చదువు పాడవుతుందని ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాపయ్యను మందలించారు. ఫోన్ చూడటం మానేసి, చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా చెప్పారు.
తల్లిదండ్రులు తిట్టడంతో మనస్తాపం చెందిన పాపయ్య.. శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. దీంతో కుమారుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు అంతటా వెతికారు. చివరకు ఇంటిపై ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లగా అక్కడ ఉరేసుకుని కనిపించాడు. అది చూసి కంగారుపడిపోయిన తల్లిదండ్రులు కుమారుడిని వెంటనే మల్కాజిగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాపయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.