మేడ్చల్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. కఠినమైన నిబంధనలు.. విడుతల వారీగా నిధుల విడుదల.. అతి తక్కువ స్థలంలో నిర్మాణం వంటి కండిషన్ల నేపథ్యంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లపై అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయం తెలిసిందే. లబ్ధిదారుల పరిస్థితి ఇలా ఉంటే అధికారులు తీరు మరోలా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారిలో మెజార్టీ లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టడం లేదని.. ఎలాగైనా వారి చేత ఇండ్లు కట్టించేలా ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 15 వరకు మార్కింగ్ (ముగ్గులు) పోయించుకోవాలని.. ఎవరైతే మార్కింగ్ చేసుకునేందుకు ముందుకు రాకపోతే వారి ఇండ్లను రద్దుచేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
కొర్రీలతో లబ్ధిదారుల్లో ఆందోళన..
ఈ క్రమంలో లబ్ధిదారులు అసలు ‘ఇందిరమ్మ’ ఇండ్లు నిర్మించుకునేందుకు ఎందుకు ఆసక్తి కనబరచడం లేదనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అర్హులకు మంజూరు చేయకపోవడమా.. లేదా కఠిన నిబంధనలే కారణమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 70 గజాల స్థలంలోనే ఇండ్లు నిర్మించుకోవాలని.. అధికారుల సూచనల మేరకు నిర్మాణాలు సాగాలని.. దశలవారీగా నిధుల విడుదల లాంటి సవాలక్ష కొర్రీలు లబ్ధిదారులను వేధిస్తున్నాయి.
70 గజాలు దాటి గృహం నిర్మిస్తే బిల్లు రాకపోతే ఎలా అన్నది ఆలోచిస్తున్నామని.. అందుకే ఇంటి నిర్మాణానికి తటపటాయిస్తున్నామని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్హుల ఎంపిక ఇందిరమ్మ కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు జరగాల్సి ఉన్నా.. కాంగ్రెస్ నాయకులు జోక్యంతో అనర్హులకు ఇండ్లు మంజూరయ్యాయన్న విమర్శలూ లేకపోలేదు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులకు ఇండ్లు కేటాయించడంతో పాటు నిబంధనలను సులభతరం చేస్తే అందరూ నిర్మాణాలు చేసుకునేవారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
శ్రావణమాసంలో అనుమానమే..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో శ్రావణమాసంలో గృహ ప్రవేశాలు చేయడం అనుమానంగానే కనిపిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 711 ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్(ముగ్గులు) పూర్తి అయ్యి.. గ్రౌండింగ్ కాగా 107 గృహాలకు బేస్మెంట్లు పూర్తయ్యాయి. 18 ఇండ్లకు మాత్రమే పై కప్పులు పడ్డాయి.
లబ్ధిదారులపై అధికారుల ఒత్తిడి
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 1,617 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా.. వీటిలో 711 గృహాలకు మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన లబ్ధిదారులు వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పథకం ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ముందుకు రాకపోవడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. మిగిలినవారితో ఎలాగైనా ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని కంకణం కట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఆగస్టు 15లోపు మిగిలిన 906 మందిచే మార్కింగ్ చేయించాలనుకుంటున్నారు. ఒకవేళ లబ్ధిదారులు మాట వినకపోతే వారికి కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేయాలని చూస్తున్నారు. ఆ ఇండ్లను మిగిలిపోయిన లబ్ధిదారులకు కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని లబ్ధిదారులకు వివరిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని.. మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల కోసం 1.42లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.