మొయినాబాద్, ఆగస్టు 03 : పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన సీహెచ్ అనిత కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్లోని వనస్థలిపురంలోని తన బంధువుల ఇంట్లో పెళ్లికని ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి వాళ్లు ఇంటికి ఆదివారం ఉదయం 11:30 గంటలకు ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా కూడ తెరిచి ఉంది. అందులో నుంచి 2 బంగారు నెక్లెస్లు, 2 జతల చెవి కమ్మలు, రెండు బ్రాస్లెట్లు, 4 బంగారు గాజులు మొత్తం 16 తులాల బంగారం అభరణాలను దొంగిలించారు. దొంగతనం జరగడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రంగంలోనికి దింపి దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.