సిటీబ్యూరో, అక్టోబర్18(నమస్తే తెలంగాణ): ఒరిస్సా కేంద్రంగా వయా హైదరాబాద్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.8లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం…ఒరిస్సాకు చెందిన మురళీనాయక్, కాల చరణ్‌లు ముంబాయికి చెందిన గంజాయి వ్యాపారుల సూచన మేరకు ఒడిషా నుంచి గంజాయిని కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు. ముంబాయి వ్యాపారుల కోసం ఆల్ఫా హోటల్ వద్ద వేచి ఉండగా, సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8లక్షల విలువ చేసే 16.054కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.