GHMC | సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో పచ్చదనం పెంపుపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. కంటితుడుపు చర్యగా ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 30.81 లక్షల మొక్కలతో ముగించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు కూకట్పల్లి, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లకు నిర్దేశిత లక్ష్యాలను ఖరారు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలాఖరులోగా పచ్చదనం పెంపునకు ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్న దరిమిలా.. ఈ మేరకు జీహెచ్ఎంసీ గ్రీనరీ పెంపునకు నామ మాత్రంగా చర్యలు చేపట్టడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 8 సార్లు హరితహారం ద్వారా ప్రతి ఏటా గ్రేటర్లో కోటి మొక్కలను నాటారు.
ఖాళీ స్థలాల్లో యాదాద్రి మోడల్ మియవాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్ , అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ ట్రీ పారులు వంటి పేర్లతో పచ్చదనం, సుందరీకరణ పనులను చేపట్టారు. కాలనీలను పచ్చదనంతో నింపేశారు. ఫలితంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం ఉండగా, బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం తర్వాత అటవీ విస్తీర్ణం 81.81 స్వేర్ కిలో మీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా) ప్రకటించింది.
ఎఫ్‌ఎస్‌ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికిగాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా గుర్తించాయి. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీలో పాల్గొనగా, హైదరాబాద్ నగరానికి ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ ఘనత దక్కింది. పచ్చదనం పెంపునకు బీఆర్ఎస్ సర్కారు పెద్ద పీట వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీనరీ పెంపుపై చిన్నచూపు చూడటం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. గ్రేటర్లో పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు.