సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో వివిధ సమస్యలపై 138 ఫిర్యాదులు అందాయి. బల్దియా ప్రధాన కార్యాలయం, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్‌లోని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. బల్దియాప్రధాన కార్యాలయంలో 37, చార్మినార్ జోన్లో 10, సికింద్రాబాద్ 10, కూకట్పల్లి 39, శేరిలింగంపల్లి 29, ఖైరతాబాద్ 1, ఎల్బీనగర్ 12 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులకు వారం రోజుల్లోగా పరిష్కారం చూపుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా మొత్తం 35 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. ఇండ్ల నిర్మాణాల కోసం 20, ఇతర 15 వరకు వచ్చాయని కలెక్టర్ అన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దార్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవోలు సూర్యప్రకాశ్, రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.