రెండో విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న నగరంలోని 9 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరుగనున్నది. పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ పద్ధతిలో మొత్తం 13, 200 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మేయర్ విజయలక్ష్మిలు ముఖ్య అతిథిగా హాజరై ఆయా ప్రాంతా ల్లో ఇండ్లు పంపిణీ చేయనున్నారు.
(నమస్తే తెలంగాణ) సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): రెండో విడత ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 21న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో రూ.10 వేల కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి విడతలో ఎంతో పారదర్శకంగా ర్యాండమైజేషన్ పద్ధతిలో 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 2న 8 ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఇండ్లను పంపిణీ చేసినట్లు మంత్రి తలసాని వివరించారు. రెండో విడతలో ఈ నెల 15న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్లైన్ డ్రా నిర్వహించి 13,200 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. డ్రా లో ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 21న 9 ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.