Ganja : హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. బాచుపల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి(కన్నాబిస్)తో ఓ యువకుడు దొరికాడు. విచారణ అనంతరం అతడిని ఒడిశాకు చెందిన కృష్ణ జెనా(29)గా గుర్తించారు. అక్రమంగా ఇతర ప్రాంతాలకు మత్తుపదార్థాలను తరలిస్తున్న అతడి నుంచి పోలీసులు ఏడు ప్యాకెట్ల గంజాయి, వివో మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో బాచుపల్లి ఎక్స్ రోడ్డులో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేశారు. సోదాలు చేస్తుండగా కృష్ణ జెనా అనే యువకుడి వద్ద 13 కిలోల గంజాయి పట్టుబడింది. అతడి దగ్గర నుంచి ఏడు ప్యాకెట్లలో చుట్టి ఉన్న గంజాయిని, వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
‘గంజాయిని ఎక్కడ కొన్నావు? ఎక్కడికి తరలిస్తున్నావు?’ అని ప్రశ్నించగా.. తనది ఒడిశా అని, ప్రస్తుతం గుజరాత్‌లోని సూరత్‌లో నివసిస్తున్నట్టు అతడు చెప్పాడు. ఒడిశా నుంచి తాను గంజాయిని తీసుకొని సూరత్‌లో అమ్మేందుకు వెళ్తున్నానని పోలీసుల విచారణలో కృష్ణ జెనా వెల్లడించాడు. గంజాయి సరఫరాలో కృష్ణకు సహకరించిన ఒడిశా బాలుగావ్ ప్రాంతానికి చెందిన జీలా పరారీలో ఉన్నాడని, అతడి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.