వనస్థలిపురం(హైదరాబాద్) : బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన 118 జీవోను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ( MLA Sudhir Reddy) ఆరోపించారు. మంగళవారం బీఎన్‌రెడ్డినగర్‌లో 118 జీవో పరిధి కాలనీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కిందిస్థాయి నుంచి పైదాకా అందరి అధికారులకు వివరించి, కేటీఆర్(KTR), కేసీఆర్(KCR) ల సహకారంతో ఎల్బీనగర్ నియోజకవర్గం కోసమే 118 జీవోను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. దానిని పూర్తి స్థాయిలో అమలు చేసి, అందరికీ కన్వీనియన్స్ డీడ్ ఇప్పించేందుకు కృషి చేస్తున్న సమయంలో ఎన్నికలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం జీవోను పట్టించుకోకుండా ఆపేసిందన్నారు.
ఇప్పటికీ కలెక్టర్, సీసీఎల్ఏతో తాను మాట్లాడుతున్నానని , సీఎం ఆదేశాలుంటేనే తామే ఏదైనా చేయగలమని అధికారులు అంటున్నారని వివరించారు. జీవోపై అవగాహన లేని మాజీ ఎంపీ మధుయాష్కి (Madhuyaski) అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. నిజామాబాద్ ప్రజలు తరిమితే ఇక్కడికి వచ్చాడని, తానే సీఎం లేదా డిప్యూటీ సీఎం అని ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నాడని విమర్శించారు.
డబ్బులు వచ్చే పనుల కోసం సీఎంను కలుస్తాడని, ప్రజల కోసం కాదని ఆరోపించారు. . డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నాడని, దాన్ని త్వరలోనే బయటపెడాతమన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలతో కలిసి త్వరలోనే కార్యాచరణ తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, నాయకులు ముద్దగౌని సతీష్‌గౌడ్, గంగం శివశంకర్, కాలనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.